నగరంలో రేవ్ పార్టీ కలకలం

by Aamani |
నగరంలో రేవ్ పార్టీ కలకలం
X

దిశ, శేరిలింగంపల్లి : పోలీసులు ఎన్నిమార్లు హెచ్చరించినా నగరంలో రేవ్ పార్టీలు ఆగడం లేదు. పుట్టినరోజు వేడుకలు, గెట్ టు గెదర్ లు అంటూ యువత రేవ్ పార్టీలు నిర్వహిస్తుంది. ఇందులో ఎక్కువగా బడా బాబుల పిల్లలే ఉంటున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన ఎస్ ఓటీ, గచ్చిబౌలి పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో పలువురు వ్యాపారులు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 18 మంది పాల్గొనగా పార్టీలో 12 మంది అబ్బాయిలు, 6 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పక్కా విశ్వసనీయ సమాచారంతో మెరుపు దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు వారి వద్ద నుండి 45 గ్రాముల గంజాయి, సిగరెట్లు, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 18 మందికి 41సీఆర్ పీసీ నోటీసులు ఇస్తామని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed