రాష్ట్ర మంత్రి వస్తున్నా.. మాకు సమాచారం ఇవ్వరా?

by Disha News Web Desk |
రాష్ట్ర మంత్రి వస్తున్నా.. మాకు సమాచారం ఇవ్వరా?
X

దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు అన్న తీరుగా ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. తాజాగా.. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనలో కూడా బీజేపీ కార్పొరేటర్ రవిచారి వర్సెస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మధ్య ప్రోటోకాల్ విషయమై వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంనగర్ డివిజన్ మేదర్ బస్తీలో ఫీవర్ సర్వే కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోయాక కార్పొరేటర్ కె.రవిచారి వచ్చారు. మంత్రి వస్తే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యేను కార్పొరేటర్ కె.రవిచారి నిలదీశారు. కేవలం అరగంట ముందు సమాచారం ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులతో రవిచారి మాట్లాడుతూ.. రాంనగర్ డివిజన్ మేదర బస్తీకి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వచ్చి కేవలం ఒకరి దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని నామమాత్రంగా వెళ్లిపోవడం శోచనీయమన్నారు. స్థానిక కార్పొరేటర్ అయిన తనకు సమాచారం ఇవ్వకుండా తొందర తొందరగా సర్వే ముగించుకొని వెళ్లిపోయారని విమర్శించారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్ వివరణ

నగర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ రాంనగర్‌కు వచ్చారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ "దిశ" ప్రతినిధితో అన్నారు. మంత్రి అకస్మాత్తుగా వచ్చారని తెలిపారు.

సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్పొరేటర్‌పై ఫిర్యాదు చేస్తాం: టీఆర్ఎస్ నాయకులు

ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే పిచ్చకుంట్ల అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంనగర్ కార్పొరేటర్ రవిచారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రం శేఖర్ అన్నారు. రాంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రం శేఖర్ మాట్లాడుతూ.. రాంనగర్ మేదర బస్తీలో జరిగిన ఫీవర్ సర్వే కార్యక్రమం మంత్రి శ్రీనివాస్ యాదవ్ వస్తున్న సమాచారం కార్పొరేటర్ ఇవ్వలేదన్న కక్షతో ఆ కార్యక్రమాన్ని బూతులు తిట్టన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి కార్పొరేటర్లు పని చేయాలని, అంతేగానీ, విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story