కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by karthikeya |   ( Updated:2024-10-07 07:44:41.0  )
కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: కార్మికులకు బోనస్‌ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా పండుగకంటే ముందే అందించడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలని బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దానికోసమే తమ ఇందిరమ్మ ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తుందని అన్నారు. ఈ రోజు (సోమవారం) ప్రగతి భవన్‌లో నిర్వహించిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో భట్టి విక్రమార్క కార్మికులనుద్దేశించి ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కూడా అదే ఆలోచనతో తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సీఎం కూడా సింగరేణి కార్మికుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్‌లా తాత్కాలికంగా, తూతూ మంత్రంగా పనిచేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, సంస్థను అభివృద్ధి వైపు నడిపించడానికి ఏం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

సింగరేణి సంస్థ కార్మికులదని, సింగరేణి ఆస్తి కార్మికులదని, కేవలం వాళ్లని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదని పేర్కొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ సంస్థ ఆధీనంలోని ఒక్క మైన్‌ని కూడా బయటకు పోకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.కార్మికులను నిలబట్టడానికి ఏం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడతామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులకు చెక్కుల పంపిణీ చేశారు.


Advertisement

Next Story

Most Viewed