ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

by Sridhar Babu |
ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు :  మంత్రి కేటీఆర్
X

దిశ, ఎల్బీనగర్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం హయత్ నగర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లే ఫ్లై ఓవర్ ను ఆయన ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని వెల్లడించారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఎస్ఆర్డీపీ నిధుల కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ.650 కోట్లతో చేపట్టామని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ తొమ్మిదవ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, బైరామల్ గూడలో సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్, రెండు లూప్ లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఈ పనులు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు మెట్రో రైలు

ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల దాకా టైమ్ పట్టేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి రావడంతో ఆ బాధల నుంచి విముక్తి కలిగిందన్నారు. ఈ ఫ్లైఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు తీసుకువస్తామని, హయత్ నగర్ వరకు కూడా విస్తరిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో దానిని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జీవో నెంబర్ 118 కింద దశాబ్దాలుగా పరిష్కృతంగా ఉన్న సమస్యను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో పరిష్కరించుకున్నామని అన్నారు. ఈ నెలాఖరులోగా పట్టాలు అందించి ఆ బాధ నుంచి విముక్తి చేస్తామని, మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

Advertisement

Next Story