ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. శేరిలింగంపల్లిలో పోలీసుల పహారా

by Aamani |
ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. శేరిలింగంపల్లిలో పోలీసుల పహారా
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పోలీసులను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధం హద్దులు దాటి దాడుల వరకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద గురువారం సాయంత్రం నుంచే పోలీసుల పహారా పెంచారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. అయితే శుక్రవారం గాంధీ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ ఎస్ నేతలు ప్రకటించడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న పలువురు బీఆర్ ఎస్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. నానక్ రాంగూడలోని మాజీ మంత్రి హరీష్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు.

మా ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి పంపుతా: ఎమ్మెల్యే గాంధీ

బీఆర్ ఎస్ నాయకులు తన ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి పంపుతానని అన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ. ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అవసరం అయితే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు. అందుకోసం తన ఇంటి ఆవరణలో కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గాంధీ.

ఎమ్మెల్యే గాంధీ ఇంటికి దానం, బొంతు, సంజయ్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి చేరుకున్నారు. బీఆర్ ఎస్ నాయకులు గాంధీ ఇంటికి వస్తామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు బొంతు రామ్మోహన్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితర కాంగ్రెస్ నేతలు గాంధీ ఇంటికి వచ్చి గురువారం నాటి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

ఏఐజీ ఆస్పత్రికి హరీష్ రావు..

సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న తరుణంలో గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే తనకు చేతికి గాయం అయిందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని, తాను బయటకు వెళ్తానని చెప్పారు. అయినా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గాయాలయినా చికిత్స పొందే హక్కు లేదా ఎలా నిర్బంధిస్తారు అంటూ గొడవకు దిగారు దీంతో పోలీసులు దగ్గరుండి మరీ ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.


కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల నినాదాలు..

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద శుక్రవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్న గాంధీ అనుచరులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నం..

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ ఎస్ నాయకులు యత్నించారు. మెయిన్ రోడ్డు పైకి వచ్చి గాంధీ ఇంటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వచ్చిన పలువురు బీఆర్ ఎస్ నాయకులను పోలీసులు అక్కడే అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed