తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-11-01 14:19:34.0  )
తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కోఆపరేటీవ్, మార్కెటింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఏసీఎస్, మార్కెటింగ్ యార్డుల్లో సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్ల ఆధీనంలో ఉన్న గోదాముల నిర్వహణ, ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా చేసి మార్కెట్ల ఆదాయం పెంచాలని, ఆ నిధులను రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా సౌకర్యాల కల్పనకు వినియోగించుకోవాలని కోరారు. ప్రాథమిక సహకార సంఘాలకు (పీఏసీఎస్) సంబంధించి రైతులకు మరింత సులభతరంగా, సమర్థవంతంగా సేవలు అందేలా రీ-ఆర్గనైజేషన్ చేసి, అవసరమున్న చోట కొత్త శాఖలు ఏర్పాటు చేయాలని సూచించారు. సంఘాల పరిపుష్టికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


డీసీసీబీ, డీసీఎంస్ఎస్‌లలో గతంలో జరిగిన అవకతవకలన్నింటిపై శాఖాపరమైన విచారణను త్వరితగతిన పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్ చార్జీలు ఆదేశాలు వెలువడిన చోట నిధుల రికవరీ చేయాలన్నారు. మార్కెట్‌కు, జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. వాట్స్ యాప్ సేవలను 8897281111తో వెయిటింగ్ టైం, పేమెంట్ స్టేటస్, కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను వినియోగించుకోవాలని రైతులను కోరారు. అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, సీసీఐ అధికారులు అప్రమత్తంగా ఉండి, కొనుగోలు కేంద్రాలకు రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్, డైరెక్టర్ కో-ఆపరేటివ్ ఉదయ్ కుమార్, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story