జూన్- డిసెంబర్ మధ్యలో.. తెలంగాణకు కొత్త సీఎం

by Mahesh |
జూన్- డిసెంబర్ మధ్యలో.. తెలంగాణకు కొత్త సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రావచ్చని, వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైనా ఇది జరగొచ్చని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తవారి ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని, ఆశావహులు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారని బాంబు పేల్చారు. హైదరాబాద్ లో ఆయన శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి ఇటీవల కాలంలో ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీని అయినా కలవాలని కేరళలోని వయనాడ్ కు వెళ్లినా దర్శనభాగ్యం కలగలేదన్నారు. రేవంత్ రెడ్డి హాలిడే పీరియడ్ ముగిసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. త్వరలోనే ఆయన సీటుకు ఎసరు పడనుందన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.50 లక్షల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్ల వ్యయానికి పెంచుతూ రేవంత్ మాట్లాడారని, మూడింతలు పెంచి చెప్పారన్నారు.

ఇందులో భారీగా స్కాం జరగబోతోందని అధిష్టానం భావిస్తోందని, అందుకే కాంగ్రెస్ రేవంత్ ను దూరం పెడుతోందన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ తీరు.. పార్టీకి నష్టమని సీఎంను వ్యతిరేకిస్తున్నారని, కొందరు ఎదురు తిరుగు తున్నారన్నారు. బయటకు చెప్పలేని వాళ్ళు చెవులు కొరుకుతున్నారని, ఇంకొందరు గ్రూపులు కడుతున్నారన్నారు. సీఎం ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తున్నారని.. ఢిల్లీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని ఏలేటి పేర్కొన్నారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారన్నారు. దీన్ని అధిష్టానం కూడా నమ్ముతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏమీ దొరక్కుండా చేస్తున్నారని కాంగ్రెస్ లో ఒక వర్గం ఇప్పటికే గ్రూపుగా ఏర్పడ్డారన్నారు. దీనిపై ఢిల్లీలో భేటీ అయ్యారని, రేవంత్ ను తొలగించాలని హైకమాండ్ ను కూడా ఒప్పించారని ఏలేటి బాంబు పేల్చారు.

సీనియర్ మంత్రులు.., సీఎం రేవంత్.. హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్‌మెంట్లపై హైకమాండ్ వద్ద తేల్చుకునేందుకు నివేదికలు పంపారని, ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం హామీలు అమలు చేయకుండా హైడ్రా, మూసీని రేవంత్ ఎందుకు ముందుకు వేసుకున్నాడని హైకమాండ్ సైతం ఆలోచిస్తోందన్నారు. ఈ సెల్ఫ్ ఎజెండాకు కారణమేంటనేది పార్టీ ఆరా తీసిందని, దీని ద్వారా పార్టీకి నష్టమని, రేవంత్ కు లాభమని గ్రహించి ఆయనను దూరం పెట్టినట్లుగా ఏలేటి చెప్పారు. ఒక సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లమ రాజు.. మూసీ అంశంపై సోనియా గాంధీకి నేరుగా వెళ్లి ఇక్కడి పరిస్థితి వివరించారని, రేవంత్ పై ఫిర్యాదు చేశారన్నారు. రంగంలోకి దిగిన ఆమె.. డీకే శివకుమార్‌కు చెప్పి రేవంత్ కు ఫోన్ చేసి కనుక్కోమనగా.. డీకే శివకుమార్.. కాల్‌ను రేవంత్ లిఫ్ట్ కుడా చేయలేదని చెప్పుకొచ్చారు. దీన్ని రేవంత్ రెడ్డి.. స్వయంగా చిట్ చాట్‌లో ఒప్పుకున్నారని తెలిపారు. దీనిపై హైకమాండ్ మరింత ఆగ్రహంతో ఉందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ వ్యక్తిగత లాభం కోసం పార్టీని పణంగా పెడుతున్నాడనే భయంతో హైకమాండ్ ఉందన్నారు. కేవీపీ రామచంద్రరావు ఇల్లు కూల్చివేత అంశంపై రేవంత్ చిన్న పిల్లాడిలా మాట్లాడారని ఏలేటి పేర్కొన్నారు. దీనిపైనా అధిష్టానం సీరియస్ గా ఉందని ఆయన వివరించారు.

ఏఐసీసీకి వస్తున్న ఫిర్యాదులు, గమనిస్తున్న తీరును చూస్తే రేవంత్ కు ప్రత్యామ్నాయం ఎవరు అని పార్టీ ఆలోచిస్తోందని ఏలేటి వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న భట్టి వచ్చీ.. రాగానే.. హై రైజ్డ్ బిల్డింగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, అయితే సీఎం రేసులో తాను కూడా ఉన్నానని దీని ద్వారా చెప్పకనే చెప్పారన్నారు. సీఎం రేసులో ఉన్న ముగ్గురు సీనియర్ మంత్రులు.. పూస గుచ్చినట్టు ఢిల్లీ పెద్దలకు ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇదంతా రేవంత్ గ్రహించి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో మధ్యలోనే సీఎంను మార్చడం ముందు నుంచి వస్తున్న కల్చరేనంటూ ఏలేటి పేర్కొన్నారు. అధిష్టానం నుంచి వస్తున్న సంకేతాల ఆధారంగానే.. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని, తన నాలుక పై మచ్చలున్నాయని వ్యాఖ్యలు చేశారని మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.

రేవంత్.., కేబినెట్ విస్తరణ చేయనిది కూడా తన పదవి పోతుందనే భయంతోనేనని, కొత్తవారికి ఇద్దామంటే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోరని, సీనియర్లకు ఇద్దామంటే వారి నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోననే భయంలో రేవంత్ ఉన్నాడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవుల కోసం రేవంత్ గ్రూప్.. ఆయన వ్యతిరేక గ్రూపు మధ్య ఇప్పటికే పోరు మొదలైందని ఏలేటి చెప్పారు. రేవంత్ ద్వారా మంత్రి పదవి వచ్చింది అని భావించిన వారే ఆయన వెంట ఉన్నారని, మిగతా వారు హైకమాండ్ మన్ననలు పొందే పనిలో నిమగ్నమయ్యారని ఆయన వివరించారు. మూసీ, హైడ్రా విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పైకి నటిస్తున్నా.. వాస్తవం మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. ఇటీవల భట్టి ప్రెస్ మీట్ లో మూసీ సుందరీకరణకు అయ్యే ఖర్చు, కూల్చివేతల తర్వాత వారికి ఇవ్వాల్సిన ఇండ్ల అంశాలపై రేవంత్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీ ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎలా అవుతాయని? డీపీఆర్ లేకుండా ప్రతిపక్షాలు ఎలా విమర్శిస్తాయని ఆయన మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం సైతం.. హైకమాండ్ కు తలనొప్పిగా మారిందన్నారు.

బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామని, ఎల్పీ మొత్తాన్ని విలీనం చేస్తామని చెప్పి.. రేవంత్ హైకమాండ్ ను ఒప్పించారని, ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ ను.. పార్టీ లైన్ ను దాటేలా చేశారని ఏలేటి పేర్కొన్నారు. తీరా చూస్తే.. 11 మంది కూడా చేరలేదన్నారు. వచ్చినవాళ్లు కూడా తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ ను తప్పించేందుకు.. హైకమాండ్ కూడా ఓటుకు నోటు కేసు కోసం ఎదురుచూస్తున్నట్లుగా సమాచారం ఉందని ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సీఏం రేసులో ఉన్నవారిలో నల్లగొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు ప్రచారమవుతుండగా, ఖమ్మం జిల్లాలో మంత్రి భట్టి పేరు ప్రచారం జరుగుతోందన్నారు. ఇకపోతే మంత్రి దామోదర రాజనర్సింహ నుంచి వైద్యశాఖ లాక్కుని సీఎం రేవంత్.. తన వద్ద పెట్టుకోవాలని ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చేసినా వృధా అని కొట్టిపారేశారు.

Advertisement

Next Story