Minister Jupally : సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ

by Aamani |
Minister Jupally : సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ
X

దిశ, రవీంద్రభారతి : ప‌ద్మ‌విభూష‌ణ్ కాళోజీ నారాయ‌ణ రావు తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శన‌మ‌ని, తెలంగాణ యాస‌కు, భాష‌కు జీవంపోసి ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఊపిరిలూదిన మ‌హానీయుడు కాళోజీ నారాయ‌ణ‌రావు అని ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ నారాయణరావు 108వ జయంతి వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం రవీంద్రభారతి లో ఘ‌నంగా నిర్వ‌హించింది. కాళోజీ నారాయ‌ణ రావు జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ - మానవతా విలువలు అనే అంశంపై ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన‌ కవి సమ్మేళన కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కాళోజీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అన్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని, అసమానతలు, దోపిడీ, నిరాదరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యాన్ని నింపిందని గుర్తు చేశారు. ముఖ్యంగా స్థానిక భాషకు ప్రాధాన్యతనిచ్చి ఎవరి వాడుక భాషను వారు రాయాలని, ఇతరుల భాషను అనుకరించే బానిస భావన పోవాలని, ఆయన తపించిన తీరుతో ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం వెల్లుబికుతుందని అన్నారు. కాళోజీ కవితా సంకలనం ‘నా గొడవ’లో ఆయన రాసిన అనేక పద్యాలను ఆయన ఉటంకిస్తూ ఆయన కవితాశక్తిని, భావుకతను, పోరాట ప్రతిభను, తెలంగాణ తపనను మంత్రి జూపల్లి గుర్తుచేసుకున్నారు.

ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ చిరస్మరణీయులనీ ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి వాణిప్ర‌సాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్య‌ద‌ర్శి డా. న‌మోజు బాలాచారి, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు డా,మామిడి హ‌రికృష్ణ, ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ, జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డా. న‌ల్ల‌గుంట్ల యాద‌గిరి రావు, నేటి నిజం ప‌త్రిక సంపాద‌కులు బైసా దేవాదాసు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story