ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు.. ఇస్లాం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి

by Disha News Web Desk |
ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు.. ఇస్లాం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి
X

దిశ, చార్మినార్: ప్రస్తుతం అత్యంత సున్నితమైన, కఠినమైన పరిస్థితులను ముస్లిం సముదాయం ఎదుర్కొంటుందని, అన్ని వైపుల నుంచి విద్వేష శక్తుల దాడులు జరుగుతున్నాయని జమాఅతే ఇస్లామీ హింద్ తెలంగాణా అధ్యక్షులు మౌలానా హమీద్ మహమ్మద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వం ఇప్పుడు సంస్థాగతరూపం ధరించిందని, మతతత్వ శక్తులు ముస్లింల గురించి పుకార్లను, అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఛత్తాబాజార్ జమాఅత్ విభాగం కార్యాలయంలో జరిగిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ముస్లిముల్లో రెండురకాల ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిరాశ నిస్పృహల్లో మునిగిపోతుంటే, మరికొందరు అనవసరపు దుడుకుతనం ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ రెండు విధాల వైఖరులు సరైనవి కావని ఆయన తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ముస్లిం సముదాయం సమన్వయాన్ని, నిర్మాణాత్మక వైఖరితో ముందడుగు వేయాలని ఉద్బోధించారు. ఈ కఠిన పరిస్థితుల్లో ముస్లింలు నిరాశకు గురికారాదని, అలాగే అనవసరపు ఆగ్రహావేశాలకు లోను కారాదని హితవు పలికారు. ఇస్లాం గురించి సరైన అవగాహన ప్రజల్లో కల్పించాలన్నారు. ఈ పని చేయడానికి ముస్లిం సముదాయంలోని ధర్మవేత్తలు, మేధావులు, నేతలు, వివిధ ముస్లిం సంస్థలలోని పెద్దలు అందరూ కలిసి తమ తమ పాత్రను పోషించాలని అన్నారు.

కఠిన పరిస్థితుల్లోనే ప్రతీ మనిషిలో మరుగున పడి ఉన్న సామర్థ్యాలు వెలికి వస్తాయని ఆయన గుర్తుచేశారు. ముస్లిం సముదాయ పరిస్థితులను చూసి ఆందోళన చెందరాదని, తమలోని బలహీనతలేమిటో తెలుసుకుని వాటిని దూరం చేసుకోవాలని అన్నారు. మాటల్లో, చేతల్లో తేడా ఉండడాన్ని ఇస్లాం ఇష్టపడదని గుర్తుచేస్తూ, సంపూర్ణంగా త్రికరణశుద్ధిగా ఇస్లాంకు కట్టుబడినప్పుడే అల్లాహ్ మద్దతు లభిస్తుందని చెప్పారు. ముస్లిముల్లో సమైక్యత అనేది ఇప్పుడు అత్యంత అవసరమని అన్నారు. ముస్లిముల్లో ఉన్న విభేదాలను విద్వేషశక్తులు ఉపయోగించుకుని లాభం పొందుతున్నాయని, ఈ విభేదాలను దూరం చేసుకుని ఒకేతాటిపై రావాలని అన్నారు. సత్యధర్మాన్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా జీవించాలని హితవు పలికారు. ప్రతీ ముస్లిం కనీసం పదిమంది ముస్లిమేతర సోదరులకు ఇస్లాం అవగాహన కల్పించే సంకల్పం చేసుకోవాలని, అలా చేస్తే ఇస్లాం, ముస్లింల పట్ల విద్వేష వైరాలు వాటికవే అంతమైపోతాయని అన్నారు. ముందుగా జనాబ్ సయ్యద్ షా షంషుద్దీన్ ఖాద్రీ దివ్యఖుర్ఆన్ పాఠంతో ప్రారంభమైంది. జమాఅతే ఇస్లామీ హింద్, చార్మినార్ విభాగం అధ్యక్షులు జనాబ్ ఇస్లాముద్దీన్ ముజాహిద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Advertisement

Next Story

Most Viewed