తలసాని ఇలాకాలో భారీ షాక్..

by Sumithra |
తలసాని ఇలాకాలో భారీ షాక్..
X

దిశ, బేగంపేట : సనత్ నగర్ బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక వ్యక్తి ఆ పార్టీకి భారీషాక్ ఇచ్చారు. ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భారీ షాకిచ్చారని చెప్పవచ్చు. మూడు పర్యాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ వ్యక్తి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. బుధవారం చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి పార్టీ చేరికల పై సంప్రదింపులు జరిపారు. బీసీ సామాజిక వర్గానికి చెంది సొంతక్యాడర్ పార్టీ వీడడంపట్ల సనత్ నగర్ లో ప్రకంపాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేశారు. అనంతరం సికింద్రాబాద్ సనత్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన కూన వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పునున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. మంగళ, బుధవారం రెండు రోజులు చంద్రబాబు నివాసంలో పార్టీ చేరిక పై తన కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపినట్లు కూన వెంకటేష్ గౌడ్ వెల్లడించారు. టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పదవులు ఆశ చూపి చివరకు నట్టేట ముంచి తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల మనస్థాపానికి గురైన కూన వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి స్వస్తిపలుకుతున్నట్లు వెల్లడించారు.

సనత్ నగర్ లో బలమైన నాయకుడు..

బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన కూన వెంకటేష్ గౌడ్ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వెంకటేష్ గౌడ్ క్షేత్రస్థాయిలో కార్యకర్తల వెన్నంటే ఉండే నాయకుడుగా చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం స్థాపించిన సినీనటుడు చిరంజీవి సమక్షంలో పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు. అనంతరం శాసనసభ ఎన్నికల్లో 2009లో కూకట్పల్లి నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2010లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరి తనసొంత నియోజకవర్గం స్థానికుడైన కూన వెంకటేష్ గౌడ్ సనత్ నగర్ నియోజకవర్గం పై దృష్టి సారించి పార్టీ ప్రతిష్టను పెంచారు. నియోజవర్గంలో పార్టీ బలమైన క్యాడర్ తయారుచేసి డివిజన్ వారిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. సనత్ నగర్ లో సునాయాసింగా గెలిచే సత్తా ఉన్న తరుణంలో అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుండి పద్మారావు చేతిలో ఓడిపోతానని భయంతో మాస్టర్ ప్లాన్ వేసి చంద్రబాబును ఒప్పించి సనత్ నగర్ టికెట్ కైవసం చేసుకున్నారు.

సనత్ నగర్ లో తలసాని గెలవగా సికింద్రాబాద్ లో పద్మారావు చేతిలో ఓటమి చవిచూశారు. అయినా కూన వెంకటేష్ గౌడ్ ఎట్టి పరిస్థితిలో వెనుకాడకుండా పార్టీని నమ్ముకుని ముందుకు వెళ్లారు. 2018లో సనత్ నగర్ లో మరోమారు కూన వెంకటేష్ గౌడ్ ను టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయగా రెండు పార్టీల పొత్తులను ప్రజలు తిరస్కరించడంతో కూన వెంకటేష్ గౌడ్ ఓటమిపాలయ్యారు. అనంతరం తలసాని కూన వెంకటేష్ గౌడ్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు కావడం ఓట్ బ్యాంక్ గండిగొట్టే అవకాశాలు ఉన్న తరుణంలో తన పాచికలతో కూన వెంకటేష్ గౌడ్ కు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆయన కొన్ని రోజులుగా పార్టీకి అంటి ముట్టనట్టు ఉంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల ఉద్దేశంతో తన సొంత గూటికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూన వెంకటేష్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు.

బల సమీకరణాలు మారేనా ?

సనత్ నగర్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు కూన వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడడంతో ఆ పార్టీ బలసమీకరణాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు మంత్రి తలసాని పై ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అసంతృప్తితో ఉండడం దీనికి తోడు కూన వెంకటేష్ గౌడ్ వెంట అడుగులు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి బల సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూన వెంకటేష్ గౌడ్ కు కార్యకర్తలతో సత్సంబంధాలు ఉండడం కొసమెరుపు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నాయకులు పూర్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కావడం గమనార్హం. బీఆర్ఎస్ నుండి కూన వెంకటేష్ గౌడ్ వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీలో భారీగా ఓట్లు గండి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో తలసానికి కష్టకాలం అని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed