మంత్రివర్గ విస్తరణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి

by Kalyani |
మంత్రివర్గ విస్తరణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి
X

దిశ, హిమాయత్ నగర్ : మంత్రివర్గ విస్తరణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో ఎవరి వాటా వారికే దక్కాలనే సామాజిక న్యాయం నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడుతూ… మంత్రి వర్గంలో రెడ్లకు, వెలమలకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. విస్తరణలో మంత్రి పదవులు మళ్ళీ అగ్రకులాలకు కట్టబెడితే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు.

ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేయాలన్నారు. బడుగుల సంక్షేమం అగ్ర కులాలు చూడరని అన్నారు. గౌడ కులస్తులకు చెందాల్సిన ఎక్సైజ్ శాఖను వెలమ కులానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తామని అన్నారు. బీసీల మంచితనాన్ని బలహీనతగా భావిస్తే రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగితే సహించబోమని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కులవృత్తులు చేసుకునే ఆయా సామాజిక వర్గాల వారికే మంత్రి పదవులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో కుందారం గణేష్ చారీ, బాలాగోని బాలరాజు గౌడ్, విక్రమ్ గౌడ్, వెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అయిలు వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story