- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్‌లో కమలం కుదేలు.. నాయకులంతా ఎవరికివారే, యమునా తీరే
దిశ, సికింద్రాబాద్ : రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రం వర్గపోరుతో కుదేలవుతున్నది. ఎమ్మెల్యే టికెట్ బరిలో ఆశావహులు ఎక్కువవడం, ఎవరికి వారే గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దిగజారుతున్నది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిస్థితి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
డీలాపడిన సమయంలో..
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా బలహీనపడిన సమయంలో ఎన్నారై, పారిశ్రామికవేత్త బండపల్లి సతీష్ గౌడ్ రంగప్రవేశం చేసి పార్టీకి జవసత్వాలు సమకూర్చారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి పార్టీని మూడోస్థానంలో నిలిపారు. దాని తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇతర పార్టీల నుంచి పలువురు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ అంతర్గత వర్గపోరుతో కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట ప్రజల్లో దిగజారిపోతోందనే వాదనలున్నాయి.
బండ కార్తీక చంద్రారెడ్డి, సారంగపాణితో లాభం జరిగేనా..?
కాంగ్రెస్ పార్టీ నుంచి నగర మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, టీడీపీ నుంచి మేకల సారంగాణి టికెట్టు ఆశిస్తూ బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి, నగర మేయర్‌గా ఎన్నికైన బండ కార్తీక చంద్రారెడ్డి, 2014 గ్రేటర్ ఎన్నికల్లో తార్నాక నుంచి మళ్లీ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సికింద్రాబాద్ టీడీపీ నుంచి వచ్చిన సారంగపాణి కూడా పలు పార్టీలు మారీ బీజేపీలో చేరారు. 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఈయన కోడలు మేకల కీర్తి బౌద్ధనగర్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సారంగపాణి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న తరుణంలో సొంత ఇంటి నుంచి పోటీచేసిన వారిని కార్పొరేటర్‌గా గెలిపించుకొలేని వాళ్లు ఎమ్మెల్యేగా గెలుస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మాత్రం పార్టీకోసం పనిచేసిన సీనియర్ నాయకులకే టికెట్టు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశావహులు ఎంతమంది ఉన్నా టికెట్ ఎవరు దక్కించుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల పార్టీలో చేరిన ఆదం విజయకుమార్
ఆదం విజయకుమార్ కూడా ఇటీవల సికింద్రాబాద్ నుంచి టికెట్ ఆశించి బీజేపీలో చేరినట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. విజయ్ కుమార్ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి సితాఫల్‌మండి కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరి 2014లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి దక్కని గెలుపు..
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అనూహ్య రీతిలో దక్కించుకోగా విజయం సాధించిన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో కనీసం మూడైనా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని అందరూ భావించారు. కానీ పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరుతో ఒక్క డివిజన్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలవలేకపోయారు. దీంతో జీహెచ్ఎంసీలో నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది.
హాజరు అంతంతమాత్రమే..
సికింద్రాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఒకరు హాజరైతే మరో నాయకుడు రాని పరిస్థితి నెలకొంది. దీంతో కార్యకర్తల్లో సైతం నిరుత్సాహం చోటుచేసుకుంటోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు తమ వెంట వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తూ, ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని పట్టించుకోకపోవడం కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందనే వాదనలున్నాయి. మూడు, నాలుగు పార్టీలు మారి వచ్చిన నాయకులు సైతం తనకే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని ఒకవర్గాన్ని వెనకేసుకుని గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని తెలిసింది.
విబేధాలు వీడండి..
విబేధాలు వీడి కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు పని చేయాలని నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తున్న తరుణంలో లష్కర్ పై దృష్టి సారించాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులంతా విబేధాలు పక్కనపెట్టి ఉమ్మడిగా పనిచేస్తే లష్కర్ ఎమ్మెల్యే సీటు గెలుపొందడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. టికెట్ ఎవరికి దక్కినా అందరూ సమిష్టిగా పని చేసి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని, ఇందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుని నాయకుల మధ్య విబేధాలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అత్యంత కీలకం కాబోతున్న సర్పంచ్ ఓట్లు.. బీఆర్ఎస్‌లో మొదలైన గుబులు!
- Tags
- Secunderabad
- BJP