‘గాయత్రి’ లీలలు.. రుద్రారంలో క్రషర్ల ఆగడాలు

by sudharani |
‘గాయత్రి’ లీలలు.. రుద్రారంలో క్రషర్ల ఆగడాలు
X

క్రషర్ యాజమాన్యాలు బరితెగిస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఇష్టారీతిన మైనింగ్ చేస్తున్నారు. మరోపక్క లెక్కల గోల్ మాల్ తో పన్నులు ఎగవేస్తున్నారు. క్రషర్‌కు కేటాయించిన భూములనే కాకుండా పక్కన ఉన్న భూముల్ని సైతం కొల్లగొడుతున్నారు. క్రషర్ ద్వారా వచ్చే కాలుష్యంతో చెరువుల్ని నాశనం చేయడమే కాకుండా చెరువు స్థలల్ని సైతం కబ్జా పెడుతున్నారు. పటాన్​ చెరు మండలం రుద్రారం గ్రామంలో సర్వే నంబర్​ 132లో గాయత్రి మెటల్​ ఇండస్ట్రీస్​ పేరుతో ఈ తతంగమంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా భూముల్ని, చెరువులను ఆక్రమించుకున్న క్రషర్ అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు.

దిశ, పటాన్​ చెరు: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో సర్వే నెంబర్ 132 లో గాయత్రి మెటల్ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఉంది. ఈ క్రషర్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను విస్మరించి అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు కేటాయించిన స్థలానికి తోడు పక్కన ఉన్న రైతుల భూముల్ని లాక్కుని వాడుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. తమ భూములతో పాటు పక్కన ఉన్న చెరువులోకి సైతం చొచ్చుకొని పోయి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. 1955 నుంచి ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, 1963 లో ప్రభుత్వం భూముల్ని తమకు అసైన్డ్ చేసిందని రైతులు చెబుతున్నారు.

క్రషర్ మొదలైనప్పటి నుంచి క్రషర్ ద్వారా దుమ్ముతో పంటల్ని పండించుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా గాయత్రి యాజమాన్యం పక్కన ఉన్న తమ భూముల్ని ఆక్రమించి తమ నోట్లో మట్టి కోరుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్ని ఆక్రమించి డంపింగ్ చేయడమే కాకుండా రూమ్ లను సైతం నిర్మించారని తెలిపారు. మా భూములు మాకు అప్పగించాలని కోరితే దౌర్జన్యం చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల విషయంపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేదని లబోదిబోమంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పెద్ద స్థాయి ఒత్తిళ్లతో ఆ వైపు కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* చెరువు స్థలం కబ్జా

పక్కన ఉన్న గట్ల కుంట చెరువు స్థలాన్ని సైతం తమ గుప్పిట్లోకి తెచ్చుకుని చెరువును ఆగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రషర్ ని ఆనుకుని చెరువు ఉండడంతో చెరువు పూర్తిగా కాలుష్య కొరల్లో చిక్కింది. క్రషర్ ద్వారా వచ్చే దుమ్ముతో నీరంతా పాడవుతుంది. నీరు కలుషితం కావడంతో చెరువు కింద ఉన్న పంటలన్ని పాడవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువు స్థలం కబ్జాకు గురవుతున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇరిగేషన్ అధికారులు కళ్లు తెరిచి చెరువును సంరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

* నిబంధనలు వర్తించవు

ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు పకడ్బందీ నియమాలను సూచిస్తున్న ఆ నిబంధనలను క్రషర్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఆది నుంచి గాయత్రి మెటల్ ఇండస్ట్రీ కాలుష్య నియంత్రణకు సంబంధించి అన్ని నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. క్రషర్ల తో పెరుగుతున్న కాలుష్యం పై ‘దిశ’ దిన పత్రికలో వస్తున్న వరుస కథనాలపై పీసీబీ అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సదరు యాజమాన్యం పూర్తి నిబంధనలను పక్కన పెట్టడంతో పాటు వాయు కాలుష్యం ఎక్కువగా వెలువడుతుందని అధికారులు నిర్ధారించారు.

పీసీబీ నిబంధనల ప్రకారం ఒక క్యూబిక్ మీటర్‌కు 600 మిల్లి మీటర్ల పరిమితి ఉండగా సదరు క్రషర్ ఒక క్యూబిక్ మీటర్‌లో 840 మిల్లి మీటర్లు కాలుష్యం వెదజల్లుతుందని అధికారులు గుర్తించారు. దీంతో పీసీబీ అధికారులు గత సంవత్సరం ఆగస్టు నెలలో సెక్షన్ 31 ఏ, యాక్ట్ 1987 ప్రకారం సదరు సంస్థకు కాలుష్య నియంత్రణ కోసం కొన్ని నిబంధనలతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు యాజమాన్యం ఇప్పటి వరకు ఆ నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అటు కాలుష్య నియంత్రణ లేక, ఇటు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ, రైతుల భూముల్ని, చెరువులను ఆక్రమించుకున్న క్రషర్ అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story