ఈదులకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Aamani |
ఈదులకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, శేరిలింగంపల్లి : ఆక్రమణకు గురవుతున్న శేరిలింగంపల్లి మండలం ఖానా మెట్ లో గల ఈదులకుంట చెరువును బుధవారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రెవెన్యూ, హైడ్రా అధికారులతో కలిసి మరోసారి పరిశీలించారు. గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సీపీఎం నాయకుల ఫిర్యాదు నేపథ్యంలో శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ డివిజన్ ఖానా మెట్ లో గల ఈదులకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖానామెట్ సర్వే నెంబర్ 7 లో గల 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణం గల ఈదులకుంటను ఓ రియలేస్టేట్ సంస్థ చెరువును పూడుస్తున్నారని సీపీఎం నాయకులు శోభన్, కృష్ణలు పలుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. విలేజ్ మ్యాప్ ను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఈదులకుంట చెరువు ఏ మండల పరిధి లోకి వస్తుంది. ఓవర్ ల్యాపింగ్ ఎలా అయింది, సర్వే వివరాలపై ఆరా తీశారు. చెరువులో ఎవరు నిర్మాణం చేపట్టారు. వారికి ఉన్న రికార్డులు ఎంటనేది కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లో ఎవరు నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 6.05 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువును పరిరక్షించాలని సీపీఎం నాయకులు శోభన్, కృష్ణలు రంగనాథ్ ను కోరారు.

అవసరం అయితే మరోసారి ఈదులకుంటను పరిశీలిస్తామని, నిర్మాణదారులకు ఉన్న డాక్యుమెంట్లను, గతంలో సర్వే చేసిన రిపోర్ట్ లను కూడా రంగనాథ్ పున పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈదులకుంట చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని అన్నారు. శేరిలింగంపల్లి మండలంలోనే అత్యధిక చెరువులు కబ్జాలకు గురైనట్లు గుర్తించామని ప్రతి చెరువును కాపాడేందుకు కృషి చేస్తామని రంగనాథ్ అన్నారు. హైడ్రా కమిషనర్ వెంట హైడ్రా అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed