సిటీని వదలని హెల్త్‌స్టాఫ్.. జూనియర్లపై వేధింపులు, వర్క్​ప్రెజర్

by Mahesh |
సిటీని వదలని హెల్త్‌స్టాఫ్.. జూనియర్లపై వేధింపులు, వర్క్​ప్రెజర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో చాలామంది స్టాఫ్​ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ఠ వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలోని వివిధ ఆస్పత్రుల్లో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్ల నుంచి నర్సుల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కొందరు డాక్టర్లు అయితే పీజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్​ప్రొఫెసర్, ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినా ఒకే ఆస్పత్రిలో పని చేయడం గమనార్హం. 20 నుంచి 25 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారు ఉన్నారు. మరికొందరైతే ఏకంగా రిటైర్‌మెంట్ వరకూ ఒకేచోట పనిచేస్తున్నట్లు సమాచారం.

గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌తో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం హెచ్‌వోడీలను మూడేళ్లు, ఉద్యోగులను ఐదేళ్లకోసారి బదిలీ చేస్తారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచేయడం చేయడం లేదు. దీనికి తోడు చాలామంది హైదరాబాద్‌లోనే ఉండేందుకు పట్టుపడుతున్నారు. దీని వలన జిల్లాల్లో 10 నుంచి 15 ఏళ్ల సర్వీస్​పొందిన ఉద్యోగులకు హైదరాబాద్‌కు వచ్చే ఆస్కారం లేకుండా పోతున్నది.

డ్యూటీలు పక్కన పెట్టి..

ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్​ ఆయా ఆస్పత్రులను గ్రిప్‌లోకి తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జూనియర్లు, కొత్తగా విధుల్లో చేరిన వారిపై వర్క్‌ప్రెజర్ పెడుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతున్నది. డ్యూటీలు పక్కకు పెట్టి మిగతా రాజకీయాలపై ఫోకస్​పెడుతున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఆఫీసర్లు కూడా తాము చెప్పిందే వింటారని ప్రచారం చేసుకుంటూ జూనియర్లు, కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

వైద్యారోగ్యశాఖలోని హెచ్‌ఓడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు కూడా ఒకేచోట ఏళ్ల తరబడి పనిచేయడం గమనార్హం. కొందరు సూపరింటెండెట్లు అయితే ఇప్పటికీ డిప్యూటేషన్​విధానంలో పని చేస్తున్నట్లు సమాచారం. మల్టీజోన్–1లో పోస్టు ఉంటే, మల్టీ జోన్ –2లో డ్యూటీలు చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ కాకుండా, కొత్తవారిని రానివ్వకుండా సదరు నర్సింగ్ అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.

నచ్చిన వాళ్లకు ఒకలా.. మిగతా వాళ్లకు వేరేలా

ఆస్పత్రుల్లోని కొందరు సీనియర్​డాక్టర్లు, నర్సులు వాళ్లకు నచ్చిన వాళ్లకు మేలు చేసేలా, మిగతా వాళ్లకు నష్టం జరిగేలా బిహేవ్ చేస్తున్నారని స్వయంగా ఉద్యోగులే పేర్కొంటున్నారు. వర్క్​తక్కువగా ఉన్నచోట నచ్చినోళ్లు డ్యూటీలు వేస్తూ.. మిగతా వాళ్లకు బీజీ వార్డుల్లోనే రెగ్యులర్‌గా డ్యూటీలు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇదే అంశంపై ఎంజీఎం వరంగల్‌లో కొందరు నర్సులు బహిరంగంగానే ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోనూ డాక్టర్ల దగ్గరి నుంచి నర్సింగ్ వ్యవస్థ వరకు ఇదే తీరు ఉన్నదని జూనియర్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed