నగరంలో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..!

by Disha Web Desk 9 |
నగరంలో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలో శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గౌలిగూడలోని శ్రీరామ మందిరంలో యజ్ఞం నిర్వహించిన అనంతరం శోభాయాత్ర మొదలైంది. ఈ యాత్రలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి హనుమ భక్తులు కాషాయ జెండాలు చేతబట్టి జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సుమారు 12 గంటల సమయంలో శోభాయాత్రను ప్రారంభించారు. బైక్ ర్యాలీ కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్దకు చేరగానే అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుంచి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాధ్యులు గోపాల్ జి ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీలో పాల్గొన్న వారితో హనుమాన్ ఛాలీసా పఠనం చేయించారు.

యాత్ర గౌలిగూడలో మొదలై కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, కాచిగూడ వీరసావర్కర్ చౌరస్తా, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, మారియాట్ హోటల్, బైబిల్ హౌస్, మహంకాళి మందిర్, పారడైజ్, మీదుగా తాడ్ బాండ్ హనుమాన్ మందిరం వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర సాగి రాత్రి 8 గంటల సమయంలో ముగియనుంది. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వచ్చంద సంస్థల నిర్వాహకులు స్వాగత వేధికలు ఏర్పాటు చేసి శోభాయాత్రలో పాల్గొన్న వారికి మంచినీరు, పులిహోర, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకు ముందు గౌలిగూడలో జరిగిన పూజలకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.



Next Story

Most Viewed