GHMC: రోజురోజుకు అవినీతి.. అక్రమార్కులకే పవర్!

by srinivas |
GHMC: రోజురోజుకు అవినీతి.. అక్రమార్కులకే పవర్!
X
  • శానిటరీ జవాన్లకు వార్డు శానిటేషన్ బాధ్యతలు
  • అక్రమాలు పెట్రేగిపోయే అవకాశం
  • నియమితులైన సగం మందిపై అవినీతి ఆరోపణలు

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ రోజురోజుకు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. ఇప్పటికే నెలొచ్చే సరికి లక్షల్లో జీతం, అంతకన్నా రెండింతలు అమ్యామ్యాలు స్వీకరిస్తున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న పలువురు శానిటరీ జవాన్లను ఇప్పుడు తాజాగా వార్డు శానిటేషన్ ఆఫీసర్‌గా నియమించటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నగరంలోని మొత్తం 30 సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌లో ఆయా ప్రాంతాల వారీగా శానిటేషన్ విధులను పర్యవేక్షిస్తున్న 150 మందిని శానిటరీ జవాన్లుగా నియమిస్తూ ఇటీవలే కమిషనల్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే.

వీరిలో విపరీతమైన అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న వారు సుమారు వందమంది వరకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలోని రెండు నుంచి మూడు ప్రాంతాలకు శానిటరీ జవాన్లుగా వ్యవహరిస్తున్న వీరిని ఏకంగా వార్డు స్థాయికి నియమించటంలో వీరి అక్రమాలు, అవినీతి అక్రమాలకు ఇక అడ్డూఅదుపు లేకుండా పోతుందన్న వాదనలున్నాయి. ఇప్పటికే ఒక వార్డులోని రెండు నుంచి మూడు సర్కిళ్లు, ఒక సర్కిల్ పరిధిలోని రెండు నుంచి మూడు ప్రాంతాల్లో స్వీపింగ్, చెత్త తరలింపు విధులను పర్యవేక్షిస్తున్న శానిటరీ జవాన్లు కనీసం అటెండెన్స్ వేసేందుకు పర్మినెంట్, ఔట్‌సోర్స్ సిబ్బంది అంటూ తేడా లేకుండా ముక్కుపిండి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కనీసం స్వీపర్లను కూడా వదలకుండా స్వీపర్ నెల మొత్తం సక్రమంగా పని చేసినా, అటెండెన్స్ వేసేందుకు ఒక్కోక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అవినీతిలో ఇంతగా ఆరితేరిన వీరిని ఏకంగా ఓ కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహించే వార్డుకే శానిటరీ జవాన్‌గా నియమించటంతో వసూళ్లకు మరింత బరితెగించే అవకాశాలున్నట్లు వాదనలున్నాయి.

సగంమంది వడ్డీ వ్యాపారులే..

వార్డు శానిటరీ ఆఫీసర్లుగా నియమితులైన 150 మంది శానిటరీ జవాన్లలో సుమారు వందమందికి నెలకు రూ.60 వేల నుంచి లక్ష వరకు జీతాలున్నాయి. అయినా వీరి అవినీతికి ఎక్కడా కూడా అడ్డుకట్టపడదు. వీరు పనిచేస్తున్న ఏరియాలో పని చేసే కార్మికులకే నూటికి ఐదు నుంచి పదిశాతం వడ్డీలకిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు సిబ్బందికి సంబంధించిన వివిధ రకాలైన ఆఫీసు పనులకు లక్షల్లో మాట్లాడుకుని యూనియన్ నేతలతో కలిసి పైరవీలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రెండు, నుంచి మూడు ప్రాంతాల్లోని శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్న ఈ జవాన్లకు తమ ఏరియాలోని మటన్, చికెన్ షాపుల నుంచి వారానికి ఐదైదు కేజీల చొప్పున మటన్ మామూళ్లుగా వస్తున్నా, దానిలో నాలుగు కిలోలు బయట విక్రయించుకున్న తర్వాత కిలో తీసుకుని ఇంటికెళ్లే జవాన్లు సైతం ఉన్నారంటే, వీరి అవినీతి ఏస్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఒక్కో జవాను కనీసం నెలకు రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య సంపాదిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

నెలకు రూ.5 వేలిస్తే...

శానిటరీ జవాన్ల పర్యవేక్షణలో పని చేస్తున్న పర్మినెంట్ శానిటేషన్ వర్కర్లు నెలకు రూ.5 వేలిస్తే చాలు సదరు కార్మికుడు విధులకు రావల్సిన అవసరం లేదు. పైసా జీతం కట్ కాకుండా వచ్చేలా ఈ జవాన్లు చక్రం తిప్పుతుంటారు. వీరు మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్లు కుమ్మక్కై పలు సర్కిళ్లలో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులు విధులకు రాకపోయినా, వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్లేలా వేర్వేరు లంచాల రేట్లను నిర్ణయించినట్లు సమాచారం. శానిటరీ జవాన్ లంచాలు అడుగుతున్నట్లు మెడికల్ ఆఫీసర్‌కు ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తే వారే శానిటరీ జవాన్‌ను పలిపించి నెలసరి రేటును ఫిక్స్ చేసి, ఇచ్చేయమని పర్మినెంట్ ఉద్యోగిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు దాదాపు అన్ని సర్కిళ్లలో ఉన్నాయి. అవినీతి, అక్రమాలలో ఇంతటి పేరు గాంచిన అక్రమార్కులైన పలువురు ఏకంగా వార్డు శానిటరీ ఆఫీసర్‌గా నియమిస్తే, అవినీతి ఎంతటి రాజ్యమేలుతుందో అంచనా వేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed