GHMC: వన మహోత్సవానికి పెండింగ్ బిల్లుల గ్రహణం

by Shiva |
GHMC: వన మహోత్సవానికి పెండింగ్ బిల్లుల గ్రహణం
X

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు విరివిగా మొక్కలు నాటేందుకు ఈ నెల 7 నుంచి చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమానికి పెండింగ్ బిల్లుల గ్రహణం పట్టుకుంది. ఫలితంగా అధికారులు ఆశించిన మేరకు కార్యక్రమం ముందుకు సాగటం లేదని తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన రూ.1,200 కోట్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పనుల బిల్లులు రూ.40 కోట్లతో కలిపి కాంట్రాక్టర్లకు రూ.1,240 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండటమే వన మహోత్సవానికి గ్రహణంగా మారింది.

14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు పలుమార్లు సర్కారు వద్దకు, కమిషనర్ వద్దకు వెళ్లటంతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ పనుల బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్ల బృందం ఏకంగా ఢిల్లీ వెళ్లి, భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వారికి బిల్లుల చెల్లింపులు జరగలేదు. దీంతో వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 3 వేల ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు ఏడాదికాలం మొక్కల నిర్వహణ చేపట్టేందుకు 3 వేల పనులకు టెండర్లను ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ కార్యక్రమం ముందుకు సాగటం లేదని తెలిసింది. ఈ కార్యక్రమం కింద 6 జోన్లలో మొత్తం 50 లక్షల మొక్కలను నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 8,01,276 మొక్కలు నాటినట్లు సమాచారం. గడిచిన 23 రోజుల్లో శేరిలింగంపల్లి జోన్‌లో అత్యధికంగా 1,67,515 మొక్కలు నాటగా, అత్యల్పంగా సికింద్రాబాద్ జోన్‌లో 96,301 మొక్కలు నాటినట్లు తెలిసింది. జోన్ల వారీగా పోల్చితే అత్యధికంగా శేరిలింగంపల్లి జోన్ 10,32,500 మొక్కలను కేటాయించగా 1,67,515 మొక్కలు నాటినట్లు సమాచారం.

23 రోజుల్లో ఏడుసార్లు రీ టెండరింగ్..

తొలుత వన మహోత్సవం కార్యక్రమం కింద 31 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించగా, ఆ తర్వాత కనీసం 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని పెంచుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు రీ టెండరింగ్ చేసినా, వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటడటంతో వాటి నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని తెలిసింది. ఫలితంగా వన మహోత్సవం కింద నాటాల్సిన మొక్కల లక్ష్యం, సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆశించిన స్థాయిలో కార్యక్రమం ముందుకు సాగటం లేదని తెలిసింది. వన మహోత్సవం కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవటానికి ఇదో కారణమైతే, మరో కారణం మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీకి ఖాళీ స్థలాలు అందుబాటులో లేవని తెలిసింది. ఒకవేళ ఖాళీ ప్రాంతాలు అందుబాటులో ఉన్నా, వాటికి ప్రహరీ గోడలు లేకపోవటంతో నాటిన మొక్కలకు భద్రత ఉండకపోవటం వన మహోత్సవానికి మరో అడ్డంకేనని చెప్పవచ్చు.

వనమహోత్సవం అమలు తీరిది..

జోన్ నాటాల్సిన మొక్కలు 26వ వరకు నాటినవి 27వ వరకు నాటినవి మొత్తం మొక్కలు

ఎల్బీనగర్ 10,12,500 1,10,068 5,082 1,15,150

చార్మినార్ 6,42,500 1,53,049 1,000 1,54,049

ఖైరతాబాద్ 6,90,000 1,16,714 7,554 1,24,268

శేరిలింగంపల్లి 10,32,500 1,59,935 7,580 1,67,515

కూకట్‌పల్లి 10,12,500 1,26,653 17,340 1,43,993

సికింద్రాబాద్ 6,10,000 83,337 12,964 96,301

మొత్తం 50,00,000 7,49,756 51,520 8,01,276

Advertisement

Next Story