సిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..అధికారులను పరుగులు పెట్టించిన ఆమ్రపాలి

by Jakkula Mamatha |
సిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..అధికారులను  పరుగులు పెట్టించిన ఆమ్రపాలి
X

దిశ, సిటీబ్యూరో:జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇకపై తమకిష్టమొచ్చిన సమయంలో రాకపోకలు సాగించటం కుదరదు. శుక్రవారం నుంచి రోజు ఉదయం పదిన్నర గంటల కల్లా విధుల్లో చేరాల్సిందేనని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు విభాగాల్లో ఉదయం పదకొండున్నర గంటలు గడిచినా, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం పై తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణ వేళలపై కమిషనర్ ఫోకస్ పెట్టారు.

పర్మినెంట్, ఔట్‌సోర్స్ ఉద్యోగులంతా ఉదయం పది గంటల 30 నిమిషాల కల్లా విధుల్లో చేరాలని, ఆ తర్వాత పది నిమిషాల గ్రేస్ పీరియడ్ తర్వాత ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ తన టేబుల్ పై ఉండాలని మేయర్ ఆదేశించటంతో కమిషనర్ ఆమ్రపాలి నగరంలోని 6 జోనల్ ఆఫీసులకు స్పెషల్‌గా సర్క్యులర్ జారీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉదయం 10.45 నిమిషాల తర్వాత విధుల్లో చేరని ఉద్యోగులకు ఆ రోజు క్యాజువల్ లీవ్‌గా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక సదరు ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో అమలు చేస్తున్న అటెండెన్స్ రూల్స్ అన్ని జోనల్ ఆఫీసులకు వర్తించనున్నట్లు కమిషనర్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

అటెండెన్స్ రూల్స్ సరే..మరీ సందర్శన వేళలు అమలు చేయరా?

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీతో ఉద్యోగుల అటెండెన్స్‌కు సంబంధించి స్పెషల్ సర్క్యులర్ జారీ చేసిన కమిషనర్ సాధారణ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ప్రతి సర్కారు ఆఫీసులో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన వేళలుగా అమలవుతున్న, జీహెచ్ఎంసీలో మాత్రం అమలు కావడం లేదు. సందర్శన వేళల్లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, ఇంజినీర్లు ఇతరత్ర విభాగాలకు చెందిన అధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివిధ విభాగాధిపతులను కలిసేందుకు ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు అధికారులు అందుబాటులో లేకపోవటంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సందర్శన వేళలను ఖచ్చితంగా అమలు చేసేలా కూడా కమిషనర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed