GHMC: మేయర్ ‘సేఫ్’

by Mahesh |
GHMC: మేయర్ ‘సేఫ్’
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రథమ పౌరురాలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి అవిశ్వాస ఆపద తప్పినట్టే. ఎట్టకేలకు ఆమె సేఫ్‌గా తన పదవీకాలం అయిదేళ్లను పూర్తి చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టేనని భావించవచ్చు.2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ తరపున బంజారాహిల్స్ డివిజన్‌లో గెలుపొంది మేయర్‌గా 2021 ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11 తో నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే అది కూడా అసాధ్యంగానే మారనుండటంతో విజయలక్ష్మికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మున్సిపల్ చట్టంపై పట్టున్న పలువురు నిపుణులు చెబుతున్నారు.

గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఆమె కొద్ది నెలల క్రితం తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో 56 సీట్లను గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో తమ పార్టీ కార్పొరేటర్లనే నియమించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మొదటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఆ తర్వాత మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరటంతో కౌన్సిల్‌లో క్రమంగా కాంగ్రెస్ బలం పెరుగుతుంది.

మూడు నుంచి 25 కు పెరిగిన కాంగ్రెస్ బలం..

2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డివిజన్లలోనే గెలిచింది. ఉప్పల్ లో ఎం.రజితా పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ నుంచి శిరీషారెడ్డి, లింగోజిగూడ నుంచి డీ.రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరటంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య నాలుగుకు చేరింది. గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాలుగు కే పరిమితమైన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య ఇప్పుడు 25కు పెరిగింది. కానీ పార్టీ మారిన కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కొత్తగా మారిన పార్టీ సభ్యులని పేర్కొనటం కుదరదని, ఇందుకు సంబంధించి సర్కారు గెజిట్ జారీ చేసి, అందులో వార్డు పేరు, క్రమ సంఖ్య, కార్పొరేటర్ పేరు, పోటీ చేసి గెలిచిన పార్టీ పేర్లతో వివరాలను పొందుపరిస్తేనే పార్టీలు మారిన కార్పొరేటర్లను కొత్త పార్టీకి చెందిన వారికి పరిగణించే అవకాశమున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

అవిశ్వాసం పెట్టాలంటే..?

మేయర్ విజయలక్ష్మి పై అవిశ్వాసం పెట్టాలని భావించే కార్పొరేటర్ల సంఖ్య మొత్తం సభ్యుల సంఖ్యలో మూడో వంతు అంటే (50 మంది) ఉండాలని చట్టం పేర్కొంటున్నట్లు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 50 మంది కార్పొరేటర్లు కలెక్టర్‌కు ఒక్కొక్కరు వ్యకిగతంగా ఫిర్యాదులు సమర్పించిన తర్వాత కలెక్టర్ వారిచ్చిన ఇన్ఫర్మేషన్‌ను క్రాస్ వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు చట్టాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సమాచారం సంతృప్తికరంగా ఉంటే కలెక్టర్ ఫారం-2 ద్వారా నోటీసులు జారీచేసి సమావేశాన్ని నిర్వహించే అవకాశముంది. అవిశ్వాస తీర్మానానికి మొత్తం సభ్యుల్లో సగం మంది అంటే 75 మంది హాజరైతేనే కోరం ఏర్పడనున్నందని, వీరిలో ఏ ఒక్కరు గైర్హాజరైనా, సమావేశం జరగదని, అవిశ్వాసం వీగిపోనున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా 56 మంది గెలిచినా, ఇప్పుడు ఆ సంఖ్య 41 కి పడిపోయింది. మున్ముందు ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశాల్లేకపోలేవు. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రేటర్ మహానగర పాలక సంస్థ చట్టం ప్రకారం నాలుగేళ్లు దాటే వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. కానీ వచ్చే ఫిబ్రవరి 11వ తేదీ కల్లా మేయర్ విజయలక్ష్మి పదవీ కాలం నాలుగేళ్లు దాటనుంది.

బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పెట్టాలనుకుంటే వచ్చే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఆ పార్టీలో ఎంతమంది కార్పొరేటర్లు ఉంటారోనన్నది అంచనా వేయలేని అంశమే. మేయర్ పదవీ కాలం నాలుగో సంవత్సరం మొదలైన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పెట్టాలని భావిస్తే సింగిల్ పార్టీగా అది అసాధ్యమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకెంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుతారన్న విషయాన్ని పక్కనబెడితే, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కార్పొరేటర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులు సంకేతాలిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సరిపోయే సంఖ్యలో కార్పొరేటర్లు లేకపోవడం, ఎక్కువ మంది సభ్యులున్న బీజేపీ, మజ్లిస్ పార్టీలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అవకాశాల్లేక పోవటంతో బీఆర్ఎస్ పార్టీకి అయిదో సంవత్సరంలోనూ అవిశ్వాస తీర్మానం పెట్టే చాన్స్ దక్కేలా లేదనే టాక్ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed