అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ.. ఆ ఫీజు వసూళ్లపై ఫోకస్

by srinivas |
అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ.. ఆ ఫీజు వసూళ్లపై ఫోకస్
X

దిశ, సిటీబ్యూరో : అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే గ్రేటర్‌లో అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజు వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సెంట్రల్ డివైడర్లు, యూనిపోల్స్, హోర్గింగ్స్, నియో/గ్లోసైన్ బోర్డులు, బస్ షెల్టర్లు, వాల్ పేయింటింగ్, ఫ్లెక్సీ బోర్డు, గ్లాస్ పోస్టర్, ఫిల్లర్ బోర్డులు, పేయింటింగ్/స్టిక్కర్/ప్లాగ్స్/షాప్ షూట్, బెలూన్లు/అంబ్రెల్లాస్, స్లైడ్/షార్ట్ ఫిల్మ్, ఆటోలు, బస్సులు, క్యాబ్స్/వ్యాన్స్‌లకు సంబంధించిన ప్రకటనలపై ఫీజు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

తనిఖీ తర్వాతే ఆమోదం..

అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజును ఎస్, ఏ, బీ, సీ కేటగిరీలుగా వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అడ్వర్ టైజ్‌మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అడ్వర్‌టైజ్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేయడంతో పాటు ప్రకటనల బోర్డులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నారు. తర్వాత అడ్వర్‌టైజ్‌మెంట్ ఇంజినీర్ వెళ్లి క్రాస్ చెక్ చేసుకుని దరఖాస్తును అడ్వర్‌టైజ్‌మెంట్ ఆఫీసర్‌కు పంపిస్తారు. ఈ ముగ్గురు అధికారులు పరిశీలించిన తర్వాత ఫైనల్‌గా అదనపు కమిషనర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయనున్నారు.

ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు..

గతంలో అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజు వసూళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. వీటని అరికట్టడానికి ఆన్‌లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాదిలో సుమారు రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి రావాల్సిన అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజు గురించి జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. ఈ విషయంలో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed