స్వీపర్లకు ఎండ కష్టాలు.. పని వేళల్లో మార్పులు

by Mahesh |
స్వీపర్లకు ఎండ కష్టాలు.. పని వేళల్లో మార్పులు
X

దిశ, సిటీ బ్యూరో: తెల్లవారే కల్లా మహానగరంలోని మెయిన్ రోడ్లు, వీధలన్నింటిని అద్దంలా మెరిసేలా శుభ్రపరిచే స్వీపింగ్ కార్మికులకు ఎండ కష్టాలు తప్పడం లేదు. మహానగరానికి ఇప్పటి వరకు అరడజను అవార్డులొచ్చేందుకు వీరే ముఖ్య కారకులు. కానీ వీరి సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కరించడంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండలు మండి పోతుండటంతో అత్యవసరమైతే తప్పా, ఇంటి నుంచి బయటకు రావద్దంటూ వాతావరణ, వైద్యారోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెల్సిందే.

జీహెచ్ఎంసీలోని పలు యూనియన్ల అభ్యర్థన మేరకు శానిటేషన్ అధికారులు ఉదయాన జరిగే స్వీపింగ్ పనులకు సంబంధించి నిన్నమొన్నటి వరకు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అనుమతించే వారు. కానీ ఇపుడు ఎండలు మండిపోతుండటంతో ఆ వేళలను సవరించి ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల కల్లా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

శానిటేషన్ విభాగంలో స్వీపింగ్ విధులు నిర్వహిస్తున్న 18 వేల 353 మంది కార్మికుల్లో నూటికి తొంభై శాతం మంది మహిళలే. వీరిలో అత్యధిక శాతం మంది కార్మికులు తమ కుటుంబ పోషణ కోసమే ఈ పనులు చేస్తున్నారు. వీరంతా ఉదయం నాలుగు గంటల కల్లా సైటుకు చేరుకుని, బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకుని విధుల్లో చేరాలని తాజాగా వెలువడిన ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో చాలా మంది సుమారు 30, 40 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వారున్నారు.

నాలుగు గంటల కల్లా తమకు కేటాయించిన ప్రాంతానికి చేరాలంటే తాము కనీసం అర్ధరాత్రి 2 గంటలకల్లా నిద్రలేవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఉదయం నాలుగు గంటలకు ఆర్టీసి బస్సులు కూడా అందుబాటులో ఉండవని, తామెలా సైటుకు చేరుతామని వాపోతున్నారు. సవరించిన డ్యూటీ టైమింగ్ కన్నా, ప్రస్తుతమున్న ఐదు గంటల నుంచి ఆరు గంటల వేళలే బాగున్నాయని కొందరు కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed