జనగణనలో కులగణన చేపట్టాలి : ఆర్. కృష్ణయ్య

by Kalyani |
జనగణనలో కులగణన చేపట్టాలి : ఆర్. కృష్ణయ్య
X

దిశ, హిమాయత్ నగర్ : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలన్నారు.

రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సంవత్సరాలుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన చేసి బీసీల జనాభా కూడా లెక్కించడానికి ఈ అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావడం లేదని మండిపడ్డారు. జనాభా లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని భయపడుతున్నారని ఆరోపించారు.

బీసీలకు కేంద్రస్థాయిలో ఒక్క స్కీము కూడా లేదని అన్నారు. కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదని, రాజకీయ రంగంలో బీసీలకు ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదంటే బీసీలకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, వై నాగేశ్వరరావు, నూకాలమ్మ, వరప్రసాద్, ప్రసన్న, గురు మూర్తి, లక్ష్మణ్ రావు, శ్రీనివాసులు, చక్రధర్, నీల వెంకటేష్ , శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story