మరింత ఘనంగా బోనాల జాతర

by Mahesh |   ( Updated:2024-06-21 03:53:42.0  )
మరింత ఘనంగా బోనాల జాతర
X

దిశ, సిటీబ్యూరో : ఆషాడమాసంలో నెల రోజులపాటు జరుపుకునే బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆషాఢమాసం బోనాలు జాతర ఉత్సవాలు-2024 పై హైదరాబాద్ జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆషాడ మాసం బోనాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో 2400 ఆలయాలు ఉన్నందున ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని సూచించారు. ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈసారి ఆలయాలకు ఇచ్చే డబ్బులు పెంచే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 28 ముఖ్యమైన ఆలయాలకు ప్రజా ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో గతంలో కంటే ఎక్కువగా బోనాల ఉత్సవాలకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరంలో వివిధ ఏర్పాటు విషయంలో జీహెచ్ఎంసీ జాగ్రత్తగా ఉండాలని, మంచినీటి విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు.

ప్రధానమైన ఆలయాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ కూడా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వాహనాలకు ఏదైనా ఇబ్బంది వచ్చి ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ఉన్న అన్ని ఆలయ ఉత్సవ కమిటీలతో రెవెన్యూ, పోలీస్, ఇతర విభాగాల అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో పనిచేసి బోనాలు పండగను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్‌మాన్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డీఆర్వో వెంకటాచారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed