పుట్టుక లోపాలను గుర్తించి చికిత్స అందించాలి

by Sridhar Babu |
పుట్టుక లోపాలను గుర్తించి చికిత్స అందించాలి
X

దిశ, కార్వాన్ : పుట్టుక లోపాలు గల పిల్లల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి చికిత్స అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి వైద్యాధికారులను సూచించారు. బుధవారం నీలోఫర్ ఆసుపత్రిని ఆయన సందర్శించి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, డయాగ్నస్టిక్ ల్యాబ్, రక్త పరీక్షల కేంద్రం, క్వాలిటీ కంట్రోల్ రూమ్, సీసీటీవీ, ఫిజియోథెరపీ, పిరియాడికల్ సర్జికల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, కాంప్రహెన్సీవ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్, ఎస్ఎన్సీయూ సెంటర్, నియోనేటాలజీ వార్డ్ లను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పేషంట్లతో ముచ్చటించి వారికి అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడుతూ పుట్టుక లోపాలతో జన్మించిన పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. పుట్టుకతో వచ్చే లోపాలతో పిల్లలు జీవితాంతం బాధ పడకుండా ఉండేందుకు వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాన్పు అయినప్పుడే లోపాలతో పుట్టిన పిల్లల సమాచారాన్ని రిజిస్టర్ తో పాటు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. పిల్లలకు సకాలంలో వైద్య చికిత్స అందించాలన్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో కలెక్టర్ రెండున్నర గంటలపాటు అన్ని విభాగాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నీలోఫర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ టి.ఉష రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆర్ఎంఓకే జ్యోతి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నాగజ్యోతి, డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ కళ్యాణి శ్రీనివాస్, డి.గంగా ప్రసాద్ పాల్గొన్నారు.

Next Story