Bandi Sanjay : రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించలేరు

by Aamani |
Bandi Sanjay : రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించలేరు
X

దిశ, శేరిలింగంపల్లి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీచేసిన బీజేపీని ఓడించడం అసాధ్యమని, బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. బుధవారం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీకి అత్యధిక సభ్యులు ఉన్నారని, తాజాగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతీ కార్యకర్త కష్టపడి మరింత మందిని సభ్యులుగా చేర్చాలన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధిస్తామని అందులో ఎలాంటి అనుమానాలు లేవన్నారు బండి సంజయ్. చేతి గుర్తు ప్రజల పాలిట భస్మాసుర అస్త్రంగా మారిందని, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని బాధపడుతున్నారని అన్నారు.

కేసీఆర్ మీద పోరాటం చేసింది బీజేపీ పార్టీనే అని అన్నారు. రేవంత్ రెడ్డి తోపు అనుకున్నామని కానీ ఆయనతో ఏమీ కాదని జనాలకు అర్ధం అయిందన్నారు. కేసీఆర్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని, అవసరం అయితే కాళ్లు పట్టుకోవడం, లేదంటే కాళ్లు పట్టుకుని లాగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఒకటేనని విమర్శించారు. 6 గ్యారంటీల కోసం ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారని, కానీ ఒక్క గ్యారంటీకి కూడా వారంటీ లేదన్నారు బండి సంజయ్. రుణమాఫీ, బోనాస్, రైతు భరోసా, మహిళలకు రూ.4 వేలు, తులం బంగారం, నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 6 గ్యారంటీల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రా అని హై డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. చిన్నా చితక వారి మీద హైడ్రా ప్రతాపం చూపుతుందని, ముందు అలాంటి వాటికి అనుమతులు ఇచ్చిన వారి మీద కేసులు పెట్టాలని, పేదల మీద ప్రతాపం చూపెడుతున్న హైడ్రాకు వ్యతిరేకమని అన్నారు. హైడ్రా కాదు ముందు 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మేము యాగాలకు వ్యతిరేకం కాదని, కానీ బిడ్డ ఇంటికి వస్తే యాగం చేస్తున్న కేసీఆర్, వరదలతో జనాలు ఇబ్బందులు పడుతుంటే యాగాలు ఎందుకన్నారు.

రాజకీయాల్లోకి రాకుండా ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టారని, ఇక రీ ఎంట్రీ కోసం యాగాలు ఎందుకన్నారు. రెండు పెగ్గులు తాగే కేసీఆర్ ను ఫుల్ బాటిల్స్ తాగించింది బీజేపీనే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రధాన నిందితుడు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ అప్పుడే కలక్షన్స్ స్టార్ట్ చేసిందని, బీఆర్ ఎస్ అందుకు కావాల్సిన నిధులు సమకూరుస్తుందని ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు రాదన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి తప్పా ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవని, వారికి ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నేషన్ ఫస్ట్, మనం సెకండ్ అనేది బీజేపీ నినాదమని, బీజేపీ గెలవడం మనకంటే దేశానికే ఎక్కువ ముఖ్యమన్నారు. మొత్తం ప్రపంచం కన్ను ఇప్పుడు భారత్ మీద ఉందని, మోడీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని చైనా, అమెరికాలు భారత్ ఎదగవద్దని చూస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు మనకంటే ఎక్కువగా మోదీని నమ్ముతున్నారని కొండా అన్నారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పార్టీకి ఎదురులేదని, రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యమ్నాయం అని అన్నారు.

దేశంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ బీజేపీ అని, రానున్న అన్ని ఎన్నికల్లో అందరూ కలిసి నడవాలని, కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కొరడాల నరేష్, మహేందర్ రెడ్డి, సురభీ రవీందర్, వేణు యాదవ్ ఆయా డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story