ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి

by Sridhar Babu |
ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి
X

దిశ, ముషీరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ పండుగ ప్రారంభమైందని, గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ఆయన సూచించారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా ఆదివారం రాంనగర్ చౌరస్తాలో తిరంగా యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత చిత్ర పటానికి పూజ చేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారని తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యతలను కాపాడేందుకు స్వాతంత్య్ర ఉత్సవాలకు సంబంధించిన చరిత్రను ప్రపంచానికి, యువతరానికి తెలియ చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 11 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు, తిరంగా యాత్ర కొనసాగనున్నాయన్నారు. తెలుగు ప్రజలు దేశ స్వాతంత్య్ర పండుగలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని తమ ఇంటిపై ఆవిష్కరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, సికింద్రాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ ఏనుగు వినయ్ కుమార్, కార్పొరేటర్లు రచన శ్రీ, రవి చారి, నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed