జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో రాజరిక పాలన

by Mahesh |   ( Updated:2023-04-04 02:50:31.0  )
జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో రాజరిక పాలన
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో కొన్నింటిలో రాజరిక పాలన కొనసాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కిళ్లకు బాస్‌లుగా వ్యవహారించే డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు తమ చాదస్తపు విధానాలు అవలంభిస్తూ ఉద్యోగులు, కార్మికులను రకరకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఒకసారి ఆదేశాలు జారీ చేసి, అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? ఒక వేళ అమలైతే ఏ రకంగా అమలవుతున్నాయన్న విషయాన్ని సమీక్షించటంలో కమిషనర్ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని వాదనలున్నాయి. కమిషనర్ వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు రాజరిక పాలనను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులు, కార్మికులను కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికన విడదీస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

అన్ని స్థాయిల అధికారులు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెటర్నరీ విభాగంలోని ఓ కార్మికుడితో శేరిలింగంపల్లి సర్కిల్‌లో టాయిలెట్లు కడిగించిన ఘటన దుమారం రేపిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత కూడా ఆ సర్కిల్ అధికారుల ఆగడాలు ఆగలేదు. పైగా మరో అడుగు ముందుకేసి ఇక్కడ వెటర్నరీ విభాగంలో పని చేసే అధికారి తాము కొత్తగా నిర్మించిన విల్లాలో పనులు చేయించుకున్నట్లు సమాచారం. ఈ రకంగా చాలా మంది డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు వారానికి ఇద్దరు కార్మికులను తమ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నట్లు, పనులు చేసేందుకు ససేమిరా అంటే దుర్బాషలాడుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ రకమైన వేధింపులతో ఇటీవల ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడిన ఘటన తెలిసిందే.

జీహెచ్ఎంసీలోని ప్రతి అధికారి ప్రజాసేవకులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. కాని ఆ విషయాన్ని విస్మరించి ప్రజా పాలకులుగా, ప్రభువులుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. చార్మినార్ జోన్ లోని ఓ సర్కిల్ ఆఫీసులోని కొందరు ఇంజనీర్లు తమ కార్యాలయంలో దళితులకు నో ఎంట్రీ అమలు చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా పని ఉంటే ఇతర కింది స్థాయి అధికారులతో చెప్పి వెళ్లిపోవాలే తప్ప, తాము విధులు నిర్వహిస్తున్న ఆఫీసు గదిలోకి రావద్దంటూ అనధికారికంగా నిబందన పెట్టినట్లు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, కార్మికులకు ఏదైనా కష్టమొస్తే నూటికి పది శాతం వడ్డీ లాగా తమ వద్దే అప్పు తీసుకోవాలని, లేని పక్షంలో వారి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

కౌన్సిల్ ఆదేశాలే ఆసరాగా..

60 ఏళ్ల వయస్సున్న శానిటేషన్ వర్కర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తప్పి, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని గత ఏడాది క్రితం కౌన్సిల్ జారీ చేసిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని, అరవై ఏళ్లు నిండని వారిని కూడా కూకట్ పల్లి జోన్‌లో విధుల్లో నుంచి తొలగించినట్లు ఆరోపణలున్నాయి. ఏళ్లుగా ఎంతో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఎఫ్ఏను విధుల్లో నుంచి తొలగించి, కనీసం ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించకుండా, ఆ పోస్టును లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు బాధిత ఉద్యోగి తనకు జరిగిన అన్యాయాన్ని సర్కిల్ స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం వరకు మొరపెట్టుకున్నా, ఒక్కరు కూడా పట్టించుకోలేదని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed