దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘హైదరాబాద్’.. అన్ని పార్టీలు, నేషనల్ మీడియా ఫోకస్ అంతా రాష్ట్ర రాజధానిపైనే..!

by Satheesh |
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘హైదరాబాద్’.. అన్ని పార్టీలు, నేషనల్ మీడియా ఫోకస్ అంతా రాష్ట్ర రాజధానిపైనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణ అయిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఫస్ట్ మీటింగ్‌పై వివిధ రాష్ట్రాల్లోని పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఢిల్లీ కేంద్రంగా జరగాల్సిన ఈ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌కు షిప్ట్ చేయడంతో జాతీయ పార్టీలతో సహా నేషనల్ మీడియా ఫోకస్ పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ రూపొందించుకునే వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పార్టీ అత్యున్నత కమిటీ సమావేశమై ఎలాంటి వ్యూహాన్ని రచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే సాకారమవుతుందనే విశ్వాసంతో ఉన్నది.

రానున్న రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులను బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావడానికి అవలంబించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. ‘ఇండియా’ కూటమి పార్టీలు మాత్రమేకాక ఎన్డీఏ కూటమి పార్టీలు సైతం సీడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయోనని నజర్ పెట్టాయి.

మరోవైపు ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఎవరి పేరును తెరపైకి తేవాలనేదానిపైనా సీడబ్ల్యూసీలో లోతుగా చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనక కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ప్రణాళిక ఉన్నదనేది సీనియర్ నేతల వాదన.

ఇక్కడ సమావేశం నిర్వహించడం ద్వారా రెండు లక్ష్యాలను సాధించవచ్చని ఒక నేత పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాకారం చేసుకోవడంతో పాటు దీని స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని గద్దె దించడానికి రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవచ్చన్నది ఆ నేత అభిప్రాయం.

ఎలాగూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీయేనని, లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఇదే వ్యూహాన్ని, ఐక్యతను, కూటమి పార్టీల సహకారంతో విజయం సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై కూడా సీడబ్ల్యూసీ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది.

ఈ సమావేశంలో తీసుకునే సంస్థాగతమైన నిర్ణయాలకు అనుగుణంగా రానున్న కాలంలో జరిగే ‘ఇండియా’ కూటమి సమావేశాల్లో పార్టీ వైఖరిని కాంగ్రెస్ వెల్లడించనున్నది. త్వరలో ‘ఇండియా’ కూటమి మీటింగ్ జరగనున్నందున జాతీయ మీడియా హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో జరిగే చర్చలు, చేసుకునే తీర్మానాలు, అధికారికంగా ప్రకటించే నిర్ణయాలపై దృష్టి పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed