HYD : చైన్ స్నాచింగ్‌లో జిగ్‌జాగ్ ఎస్కేప్ రూట్.. కేటుగాళ్ల సంచలన ప్లాన్

by Rajesh |
HYD : చైన్ స్నాచింగ్‌లో జిగ్‌జాగ్ ఎస్కేప్ రూట్.. కేటుగాళ్ల సంచలన ప్లాన్
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఓ చైన్ స్నాచింగ్ కేసులో పోలీసు దర్యాప్తునకు సంబంధించి ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. స్నాచింగ్ చేసి పారిపోతున్న స్నాచర్‌ల ఎస్కేప్ రూటును సీసీ కెమెరాల ద్వారా ఫాలో అయిన పోలీసులకు చివరకు ఫలితాన్ని దక్కేలా చేసింది. దుండుగులు ముఖానికి ముసుగు, వాహనానికి మాస్క్ వేసుకుని వారిని గుర్తు పట్టకుండా పోలీసులను గందరగోళానికి గురి చేయాలని చూసినా సీసీ కెమెరాలు వదిలి పెట్టలేదు. అలా 10 కిలో మీటర్‌ల పాటు గల్లీ గల్లీలు తిరుగుతూ స్నాచర్లు చేసిన జిగ్ జ్యాగ్ ట్రావెలింగ్ సీన్ ను సీసీ కెమెరాలు భద్రంగా దాచుకున్నాయి.

దీంతో 10 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత స్నాచర్లు ఓ చోట ఆగి ఇక తమను ఎవరు పట్టుకోలేరని, మనం తప్పించుకున్నామని ధీమాతో మొఖానికి ముసుగు, వాహనం నెంబరు ప్లేటుకు ఉన్న మాస్క్‌ను తీసేసి తిరిగి రోడ్డు పైకి రావడంతో సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి. అంతే సీసీ కెమెరాలు అందించిన ఆ క్లూతో పోలీసులు ముగ్గురు స్నాచర్లను 24 గంటల్లో పట్టేశారు. ఈ కేసులో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో 10 కిలో మీటర్‌ల దూరం వరకు 20 సీసీ కెమెరాలను ఫాలో అవ్వడంతో స్నాచర్‌ల గుట్టు తెలిసిపోయింది. ఇలా సీసీ కెమెరాల పనితనానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తోడై ఈ ముఠా స్నాచింగ్‌లకు బ్రేక్ వేసింది.

స్నాచింగ్ ఇలా..

జూన్ 1 వ తేదిన హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ నాగోలు పోలీసు స్టేషన్ పరిధిలోని మరిపల్లి గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో ఇండ్లు అద్దెకు దొరుకుతాయా అని మాటు కలిపి 86 సంవత్సరాల వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. బాధితురాలు కాళ్లు మొక్కినా స్నాచర్లు ఆమెను వదలలేదు. ఈ స్నాచింగ్ స్థానికంగా కలకలం రేపడంతో నాగోలు పోలీసులు స్నాచింగ్‌ను సవాలుగా తీసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దర్యాప్తులో భాగంగా స్నాచర్లు మొఖానికి ముసుగు, బండి నెంబర్ ప్లేట్ కనిపించకుండా దానికి మాస్క్ తొడిగినట్లు గుర్తించారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ల ఎస్కేప్ రూట్‌ను ఫాలో అయ్యారు. అలా దాదాపు 10 కిలో మీటర్ల వరకు ఉన్న సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్న పోలీసులకు ఆ తర్వాత ముసుగు తీసేసి, నెంబర్ ప్లేట్ మాస్క్ తీసేసిన ఓ సీసీ కెమెరా దృశ్యం ఊపిరి పోసింది. దాంతో నాగోలు పోలీసులు స్నాచింగ్‌కు పాల్పడ్డ నిందితులు మునగాల శివ రెడ్డి, సుంకిరెడ్డి శశిధర్ రెడ్డి, దేవులపల్లి శివకుమార్ రెడ్డిలను జూన్ 2న అరెస్టు చేశారు. 5 తులాల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed