T Congress: దీపాదాస్ మున్షీ అవుట్!.. తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు?

by Prasad Jukanti |
T Congress: దీపాదాస్ మున్షీ అవుట్!.. తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) భారీ మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా ప్రక్షాళన దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు పలు రాష్ట్రాల్లో ఇన్‌చార్జిలను మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జిని (Telangana Congress incharge) సైతం మార్చబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే చాన్స్ కనిపిస్తోంది.

సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత

కేరళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్‌గా పని చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ కేరళతో పాటు ఆమెకు అధిష్టానం తెలంగాణ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కీలకంగా వ్యవహరించడంతో తెలంగాణ పరిణామాలన్నింటిపైనా అవగాహన ఉందని అధిష్టానం దీపాదాస్ మున్షీకి అడిషనల్ వర్క్ అప్పగించింది. అయితే ఇటీవల కాలంలో దీపాదాస్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఆమె తీరు సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది. పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలకు పదవుల విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కామెంట్స్ చేయడం పార్టీని ఇరుకున పెట్టినట్లుగా మారుతోందనే చర్చ జరుగుతోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆమె స్థానంలో మరో నేతను రంగంలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు హస్తం గూటిలో చర్చ జరుగుతోంది.

పరిశీలనలో ముగ్గురి పేర్లు

దీపాదాస్ మున్షీ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో అధిష్టానం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భఘేల్ (Bhupesh Baghel), రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot), జైరామ్ రమేశ్ (Jairam Ramesh) పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధిష్టానం ఎవరిని ఇన్‌చార్జిగా పంపబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. ఇదే సమయంలో మరో అంశం సైతం తెరపైకి వస్తోంది. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగి వంద రోజులు పూర్తయ్యాయి. అయినా ఇంకా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం చర్చకు దారి తీస్తోంది. అయితే కొత్త ఇన్‌చార్జి వచ్చాకే పీసీసీ కార్యవర్గ కూర్పు ఉండబోతున్నదా? లేక ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed