- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే.. ఏడు జిల్లాల్లో వంద శాతం పూర్తి
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారంతో మరో కీలక మైలురాయి దాటింది. నవంబర్ 6న మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటి వరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే రాష్ట్రం నలుమూలాల విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్ 99.9 శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తయింది.
కామారెడ్డిలో 98.5శాతం, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇళ్లకు తాళాలు ఉన్నవి, ఇలాంటి అరకొర మినహాయిస్తే.. మిగిలిన వాటి సర్వే వంద శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. మొదట్లో ఎన్నో అనుమానాలు, అపోహాలు, వ్యక్తమైనప్పటికీ కుల గణనతోనే సామాజిక సాధికారత, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వే ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడంతో అన్ని వర్గాల్లో సానుకూలత వ్యక్తమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవటం విశేషం. సర్వేలో ముందుగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించింది. నవంబర్ 9 నుంచి సర్వే ప్రారంభించింది. ఎన్యూమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించడం ప్రారంభించింది. మొత్తం1,16,14,349 కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నాయని సర్వేలో లెక్క తేలింది. ఈ సర్వే కోసం మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొంటున్నారు. నవంబర్ 22 నాటికి 90 శాతం చేరుకుంది. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నెమ్మదిగా సాగుతోందని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుంది.
అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4న సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16న ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12న ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమై సర్వేకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అక్టోబర్ 9న మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ కులగణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10న ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధానాలతో సర్వే చేపట్టేందుకు జీవో నెం.18ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.