పెట్టుబడుల పేరుతో భారీ లాభాల ఆశ.. రూ. 10 కోట్లకు..

by Sathputhe Rajesh |
పెట్టుబడుల పేరుతో భారీ లాభాల ఆశ.. రూ. 10 కోట్లకు..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మా వద్ద పెట్టుబడులు పెట్టండి.. దండిగా లాభాలు సంపాదించండి అంటూ కుచ్చుటోపి పెట్టారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని అయిదు వందల మందికి రూ.10 కోట్ల మేర దోచుకున్న నిందితులను సైబరాబాద్​ఎకనమిక్ ​అఫెన్సెస్ ​వింగ్ ​అధికారులు అరెస్టు చేశారు. బీ.ఎన్.సతీష్​ డైరెక్టర్​గా 2015లో ఎక్స్సీఎస్పీఎల్ ​అనే సంస్థను ప్రారంభించాడు. దీంట్లో గురుప్రసాద్, జ్యోతితో పాటు కడపకు చెందిన జీ.రాజేంద్రప్రసాద్ ​రాజు (29) ఫైనాన్షియల్ ​అడ్వయిజర్ గా, పీ.వెంకటప్రసాద్​(28) టీం లీడర్‌గా, బెంగళూరుకు చెందిన వ్యాపారి ఏ.వెంకట చలపతి పనిచేస్తున్నారు. మొదట బెంగళూరులో సంస్థను ప్రారంభించి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన సతీష్​ ఆ తరువాత కేపీహెచ్‌బీ కాలనీలో రాజేంద్రప్రసాద్​ రాజు, గురుప్రసాద్, వెంకటప్రసాద్, జ్యోతిలతో కలిసి బ్రాంచ్​ను ఏర్పాటు చేశాడు.

ఆ తరువాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎక్సీఎస్పీఎల్ ​అనే వెబ్​సైట్​ను ప్రారంభించాడు. తమ వద్ద మూడు నెలలపాటు డబ్బు డిపాజిట్ ​చేస్తే రూపాయికి రూపాయి, సంవత్సరం పాటు డిపాజిట్ ​చేస్తే రూపాయికి నాలుగు రూపాయలు లాభంగా ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఎంత డబ్బు డిపాజిట్​ చేస్తే అంత మొత్తానికి ఎక్స్​కాయిన్లు ఇస్తామన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు అయిదు వందల మందిని ఉచ్చులోకి లాగిన నిందితులు రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారు. డిపాజిట్ ​గడువు ముగిసిన తరువాత డిపాజిటర్లు డబ్బు తిరిగి ఇవ్వాలని అడుగగా అపుడు ఇపుడు అంటూ కాలం గడుపుతూ వచ్చారు. వీరి మాటలు నమ్మి సంస్థలో రూ.6లక్షల 50వేలు పెట్టిన టీ.రాజేంద్రప్రసాద్​ ఇటీవల తన డబ్బు తీసుకోవటానికి కేపీహెచ్‌బీ ప్రాంతంలోని మంజీరా ట్రినిటీ భవనం 11వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉండటం కనిపించింది.

దాంతో రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎకనమిక్​ అఫెన్సెస్ ​వింగ్ ​అధికారులు నిందితుల్లో రాజేంద్రప్రసాద్​ రాజు, వెంకట ప్రసాద్, వెంకట చలపతిలను శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సతీష్, గురుప్రసాద్, జ్యోతిల కోసం గాలిస్తున్నట్టు సైబరాబాద్​ కమిషనర్ ​స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. రిజిస్ర్టార్​ ఆఫ్ ​కంపెనీస్, బ్యాంకర్లతో పాటు వేర్వేరు ఏజెన్సీలను సమన్వయం చేసుకుని నిందితులకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టయిన నిందితులపై కేపీహెచ్‌బీ పోలీస్​స్టేషన్​లో కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇలాంటి సంస్థల్లో డిపాజిట్లు పెట్టే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed