- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చినజీయర్‌తో సయోధ్య.. హిందూ ఓటు బ్యాంకు టార్గెట్‌గా కేసీఆర్ బిగ్ స్కెచ్!
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇంతకాలం తూర్పు-పడమరగా వ్యవహరించిన వీరిద్దరిని మంత్రి ఎర్రబెల్లి కలుపుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ దగ్గర వీరి బంధం చెడింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వల్మీడి గ్రామం వేదికగా ఆథ్యాత్మిక కార్యక్రమంలో తిరిగి దగ్గరకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజకీయ చాణక్యం ఈ రూపంలో మొదలైంది. హిందూ ఓటు బ్యాంక్ సమీకరణకు తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకు మంత్రి ఎర్రబెల్లి సంధానకర్త పాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ సమ్మతి లేకుండా చినజీయర్‌తో కలిసి ఒకే వేదిక పంచుకునేలా మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకుంటారనేది ఊహకందని విషయం. సీఎం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే మంత్రి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
హిందూ ఓటు బ్యాంకు కోసం..?
ఓ వైపు ‘మై హోమ్’ రామేశ్వరరావుతో ఎర్రబెల్లికి ఉన్న బంధుత్వం చినజీయర్‌ను ఈ కార్యక్రమానికి పిలవడానికి దారితీసింది. మరోవైపు కేసీఆర్‌తో ఉన్న పొలిటికల్ రిలేషన్ ఇదే ప్రోగ్రామ్‌కు సీఎంనూ ఆహ్వానిస్తున్నది. వీరిద్దరి మధ్య సంధానకర్తగా మంత్రి వ్యవహరించి వీరిని కలపనున్నారు. ఈ ప్రోగ్రామ్‌తో అటు చినజీయర్, మైహోమ్ రామేశ్వరరావుతో కేసీఆర్‌కు తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. మరోవైపు హిందూ ఓటు బ్యాంకుతో పాలకుర్తిలో మాత్రమే కాక రాష్ట్రంలోనూ బీఆర్ఎస్‌కు పొలిటికల్ అడ్వాంటేజ్ ఏర్పడుతుంది. ఈ ఫార్ములాతోనే వ్యూహాత్మకంగా వల్మీడి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది.
వచ్చే నెల 4న..
వల్మీడి గ్రామంలో సుమారు రూ.30 కోట్లతో సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించడంలో, ఆలయానికి కొత్త నిర్మాణం చేపట్టడంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకున్నారు. రామాయణాన్ని రాసిన వాల్మీకి నడయాడిన నేలగా గుర్తింపు పొందిన వల్మీడి గ్రామంలోని ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం చినజీయర్ చేతుల మీదుగా వచ్చే నెల 4న జరిగేలా ముహూర్తం ఖరారైంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సీఎం కేసీఆర్‌ను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన వస్తామని హామీ ఇచ్చారని స్వయంగా మంత్రే ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
గతేడాది ఫిబ్రవరిలో ఏర్పడిన గ్యాప్
త్రిదండి చినజీయర్‌ను సీఎం కేసీఆర్ ఆథ్యాత్మిక గురువుగానే భావిస్తారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ (సమతామూర్తి) విగ్రహావిష్కరణ కోసం ప్రభుత్వం తరఫున కేసీఆర్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పంపి ప్రభుత్వపరంగా తగిన ఏర్పాట్ల విషయంలో సీఎం చొరవ తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 5న విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీని చినజీయర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఆ ఏర్పాట్లలో భాగంగా పలుమార్లు సందర్శించిన కేసీఆర్ సరిగ్గా విగ్రహావిష్కరణ రోజున గైర్హాజరయ్యారు. శిలాఫలకం మీద సీఎం పేరు లేకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తీవ్రమైన జలుబు కారణంగానే కేసీఆర్ హాజరు కాలేదని, ప్రొటోకాల్ ప్రకారం హాజరైనవారి పేర్లు మాత్రమే శిలాఫలకంపై పెట్టామని చినజీయర్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. వాస్తవానికి చినజీయర్ నుంచే ఆగమశాస్త్రానికి సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకుని యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టారు. ప్రారంభోత్సవానికి ఆయన్ను కూడా ఆహ్వానించాలనే అనుకున్నారు. కానీ సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో ఏర్పడిన అసంతృప్తితో యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవానికి చినజీయర్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన ఆ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేదు.
దగ్గర చేస్తున్న ఆథ్యాత్మిక కార్యక్రమం
ఆథ్యాత్మిక కార్యక్రమం దగ్గర ఇద్దరి మధ్య చెడిన బంధాన్ని మళ్లీ అదే తరహా కార్యక్రమం కలుపుతున్నది. చినజీయర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండే ‘మై హోమ్’ రామేశ్వరరావుతో ఎర్రబెల్లికి ఉన్న బంధుత్వమే ఇప్పుడు ఈ మార్పునకు కారణమవుతున్నది. చినజీయర్ చేతుల మీదుగా జరిగే విగ్రహ పునఃప్రతిష్ఠాపన ప్రోగ్రామ్‌కు హాజరవుతానని సీఎం క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఈ కార్యక్రమం గురించి మంత్రి మీడియాకు వివరించారు. ఈసారి పాలకుర్తిలోని రాజకీయ పరిణామాలు గతంకన్నా భిన్నంగా ఉన్నాయన్నది స్థానికుల మాట.
సీఎం కేసీఆర్ హాజరైతే పొలిటికల్ మైలేజ్ వస్తుందన్నది ఎర్రబెల్లి ఆలోచన అని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ ఎర్రబెల్లికి ఈసారి అనివార్యంగా మారిందని, హిందూ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవడమూ అవసరంగా ఏర్పడిందని మంత్రి సన్నిహితుల అభిప్రాయం. సీఎం కేసీఆర్‌ను, చినజీయర్‌ను ఒకే వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఈ రెండు అవసరాలూ తీరుతాయన్నది మంత్రి వ్యూహంగా కనిపిస్తున్నది. బీజేపీకి గట్టి పట్టుగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును చినజీయర్ రూపంలో తనవైపునకు తిప్పుకోవాలన్నది ఎర్రబెల్లి ఆలోచన అని గులాబీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్‌కు పొలిటికల్ అస్త్రంగా..
బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అని ఇటీవల దేశవ్యాప్తంగానే ఆరోపణలొచ్చాయి. రాహుల్‌గాంధీ తెలంగాణ వేదికగానే ఈ రెండు పార్టీలపై ఓపెన్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ మార్పు మొదలు ఢిల్లీలో అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత సేఫ్ జోన్‌లోకి వెళ్లడం.. వీటన్నింటినీ కాంగ్రెస్ తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నది. వల్మీడి ప్రోగ్రామ్‌లో సీఎం కేసీఆర్, చినజీయర్ ఒకే వేదికపై కనిపిస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ నిత్యం విమర్శిస్తున్న కాంగ్రెస్ ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపి ప్రజల్లో పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేయాలని భావిస్తున్నది.
ఈ కారణంగా వల్మీడి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ మంత్రి ఎర్రబెల్లి మాత్రం.. కేసీఆర్ తప్పకుండా అటెండ్ అవుతారని మీడియాతో చెప్పారు. వచ్చేందుకు సీఎం కూడా క్లారిటీ ఇచ్చారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హిందూగాళ్లు-బొందుగాళ్లు అని కేసీఆర్ చేసిన కామెంట్ వల్ల బీఆర్ఎస్‌కు నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, హిందుత్వ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవడమే ఈ ప్రోగ్రామ్ వెనక ఉన్న రాజకీయ వ్యూహమని పలువురి అభిప్రాయం. మరి ఇది రానున్న రోజుల్లో ఎలాంటి చర్చకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: వామ్మో.. మూడు నెలలు! జంకుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు