బండి బెయిల్ పిటిషన్‌ పై హైకోర్టు క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-06 08:37:11.0  )
బండి బెయిల్ పిటిషన్‌ పై హైకోర్టు క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దాఖలు చేసిన పటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అరెస్టయ్యి కరీంనగర్ జైల్లో ఉన్నందున తొలుత దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. దీనికి బండి సంజయ్ తరఫున హాజరైన న్యాయవాది రాంచందర్ రావు వాదిస్తూ, దాన్ని ఆల్రెడీ దాఖలు చేశామని, సాయంత్రం కల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు వెలువరించే అవకాశమున్నదని పేర్కొన్నారు.

మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా తాజా బెయిల్ పిటిషన్‌పై ఆలోచిద్దామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం వివరించింది. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ టూర్ ఉన్నదని, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరింది. దీనిపై ప్రభుత్వం తగిన కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కొంత గడువు కావాలని విజ్ఞప్తి చేయడంతో కోర్టు సెలవులను దృష్టిలో పెట్టుకుని తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా హన్మకొండ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బండి సంజయ్‌కు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ మరో పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేశారు. దీనిపై జరిగిన వాదనల సందర్భంగా ఆ రిమాండ్ ఉత్తర్వుల్లో అనేక లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, సీఆర్‌పీసీలోని సెక్షన్ 50 నిబంధనల అమలులో ఉల్లంఘన జరిగిందని, సెక్షన్ 41 ప్రకారం నోటీసు కూడా ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. హిందీ పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్‌కు వాట్సాప్ ద్వారా ఇమేజ్ వెళ్ళిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. బండి సంజయ్ ఫోన్‌లో ఉన్నదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. బండి సంజయ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని బదులిచ్చారు.

బండి సంజయ్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని ఫోన్‌ను ఇంకా బండి సంజయ్ ఇవ్వలేదని, అరెస్టు ప్రక్రియే తప్పు అనే కారణంగా ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. పరీక్ష మొదలైన తర్వాత ప్రశ్నాపత్రం బైటకు వచ్చిందని, దీన్ని లీక్‌గా పరిగణించలేమన్నారు. పరీక్ష మొదలైన తర్వాత బైటకు వస్తే అది లీక్ ఎలా అవుతుందని ప్రభుత్వ న్యాయవాదిని దర్మాసనం ప్రశ్నించింది.

అన్ని వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... హన్మకొండ కోర్టు సంజయ్ బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత, ప్రభుత్వం నుంచి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాత ఇక్కడ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని సీజే బెంచ్ స్పష్టం చేసి ఈ నెల 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed