టీకాంగ్రెస్ లో హైకమాండ్ బిగ్ ట్విస్ట్.. వారికి నిరాశ

by Prasad Jukanti |
టీకాంగ్రెస్ లో హైకమాండ్ బిగ్ ట్విస్ట్.. వారికి నిరాశ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. తెలంగాణ నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో అభ్యర్థులను బుధవారం ఖరారు చేసింది. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేర్లను ఫైనల్ చేస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

వారికి నిరాశే:

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం రెండు స్థానాలు దక్కనున్నాయి. దీంతో గెలుపు ఖాయం అనుకున్న రాజ్యసభ టికెట్ కోసం పలువురు టీకాంగ్రెస్ నేతలతో పాటు ఏఐసీసీ నేతలు పోటీ పడ్డారు. ముఖ్యంగా సీనియర్ నేతలైన చిన్నారెడ్డి, వీహెచ్ పేర్లు రాజ్యసభ రేసులో ముందువరుసలో వినిపించాయి. వీరితో పాటు మరికొంత మంది నేతలు పార్టీ పెద్దలతో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ నేతల్లో అజయ్ మాకెన్, సుప్రియ శ్రీనతే రాజ్యసభ టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో అజయ్ మాకెన్‌కు కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ దక్కగా మిగతా వారికి నిరాశ మిగిలింది. అయితే తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. యువనేతగా ఉన్న ఎం.అనిల్ కుమార్ యాదవ్‌ను పెద్దల సభకు పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

ఖమ్మం రూట్ క్లియర్:

రేణుకా చౌదరికి రాజ్యసభ దక్కడంతో ఖమ్మం లోక్‌సభ బరిలో ఎవరు ఉంటారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం టికెట్ కోసం రేణుకా చౌదరి దరఖాస్తు చేసుకోలేనప్పటికీ ఈ స్థానం తనదే అని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే సోనియా గాంధీ సైతం ఖమ్మం లోక్‌సభ బరిలో నిలుస్తారనే చర్చ తెరపైకి రావడంతో ఈ టికెట్‌పై పార్టీలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా రేణుకా చౌదరి కూడాపెద్దల సభకు నామినేట్ అయ్యారు. దీంతో ఖమ్మం లోక్‌సభ స్థానానికి రూల్ క్లియర్ అయినట్లేనా? అనే చర్చ జరుగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు రేసులో లేకపోతే ఆ టికెట్ ఎవరికి దక్కబోతున్నది అనేది చర్చగా మారింది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, సీనియర్ నేత వీహెచ్, ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టికెట్ వరించేదెవరికో అనేది టీ కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed