వైద్యారోగ్య శాఖ సమీక్ష.. మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు

by Vinod kumar |
వైద్యారోగ్య శాఖ సమీక్ష.. మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించి, ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై మంత్రి హరీశ్ రావు ఆదివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. మెటర్నల్ హెల్త్, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ ప్రోగ్రాం, టెలి మానస్, బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఆరోగ్య మహిళ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరేఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందన్నారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. అందరం కలిసి పని చేయడం వల్ల ఆరోగ్య రంగంలో దేశంలోనే మూడో స్థానానికి చేరామని, ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యమని, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు.

జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలదే కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed