ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఏఐసీసీ చీఫ్ ఖర్గేకి హరీష్ రావు బహిరంగ లేఖ

by Ramesh N |
ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా?  ఏఐసీసీ చీఫ్ ఖర్గేకి హరీష్ రావు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషలాడారని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు "టెర్రరిస్ట్" అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు.

రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ఖండించిందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధాని మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. అయితే, ఇలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? అంటూ ప్రశ్నించారు. 'కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి' అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హై కమాండ్ క్రమశిక్షణ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed