Harish Rao: విద్యాశాఖ మంత్రిగా చర్యలు తీసుకోండి.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
Harish Rao: విద్యాశాఖ మంత్రిగా చర్యలు తీసుకోండి.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుమీదికి వచ్చారని, విద్యాశాఖ మంత్రిగా గురుకులాల సమస్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు నిరసన తెలుపుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై హరీష్ రావు.. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని, ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని అన్నారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని తెలిపారు.

గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా మేము ఎన్ని సార్లు చెప్పినా మీకు చీమకుట్టినట్లైనా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రావాలని, సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, నడిరోడ్డెక్కి నినదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని సూచించారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారని, గురుకులాల్లో నెలకొన్నసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన మీద దృష్టి సారించి, ప్రజల సమస్యలను పట్టించుకోవాలని హరీష్ రావు కోరారు.

Advertisement

Next Story