Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి హరీష్ రావు మద్దతు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-30 15:06:57.0  )
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి హరీష్ రావు మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోయినా, వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో సోమవారం మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేశారన్నారు. శాసనమండలిలో కూడా ఆయనకు నివాళులర్పిస్తే మరింత బాగుండేదన్నారు. ఎందుకు మండలిలో పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారన్నారు. సామన్య కుటుంబంలో పుట్టి, వీధి దీపాల మధ్య, లాంతర్లు పెట్టుకొని, స్కాలర్ షిప్ మీద ఆధారపడి చదువుకొని అసమాన్య వ్యక్తిగా ఎదిగారన్నారు. ఆర్థికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణం అన్నారు. మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆయన ఏనాడూ పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు, పదవులే ఆయన దగ్గరకు వచ్చాయన్నారు. పీవీ తన కేబినెట్లో మన్మోహన్ సింగ్‌ని ఆర్థికశాఖ మంత్రిగా తీసుకున్నారన్నారు.

తొలి ప్రసంగం దేశంలో అత్యుత్తమ ప్రసంగంగా రికార్డుల్లో మిగిలిపోయిందన్నారు. దేశాన్ని దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కించిన పీవీకి మన్మోహన్ సింగ్ ఒక చోదకశక్తిగా పనిచేశారన్నారు. మన్మోహన్ మిక్స్ అనే స్థాయికి దేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేశారన్నారు. మన్మోహన్ సింగ్ మచ్చలేని నాయకుడు, అత్యంత ఉన్నతంగా సాధాసీదా జీవితం గడిపిన మహనీయులు అని కొనియాడారు. యూపీఏ -2లో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయని, అయినా మన్మోహన్ సింగ్‌కి ఒక చిన్న మచ్చకూడా రాలేదంటే వారి గొప్పతనమే అన్నారు. అకడమిషియన్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ దేశంపై తనదైన ముద్ర వేశారని, ఆర్బీఐ గవర్నర్‌గా కరెన్సీ నోట్లపై సంతకం చేసి ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై చెరగని సంతకం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ స్వాగతిస్తుంది, సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడానికి మేం మద్దతు పలుకుతున్నామన్నారు.

పీవీ మరణించిన రోజు పట్టించుకోలేదు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేశారని, ఆయన పేరిట యూనివర్సిటీ ఏర్పాటు, పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరును పెట్టి, వారి జయంతి, వర్థంతులను అధికారికంగా జరిపించారన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కోరారు. మన్మోహన్ సింగ్‌కి భారత రత్న ఇవ్వాలని సభలో పెట్టిన తీర్మానాన్ని మేం సమర్థిస్తున్నామన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఐదేండ్ల మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ, మన్మోహన్ నడిపారన్నారు. ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే కంట తడి పెట్టారే తప్ప, తనను తప్పుపట్టారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు మన్మోహన్ సింగ్ అని, అందుకే ఆయన్ను లాయలిస్టు అన్నారన్నారు. ఆనాడు మన్మోహన్ కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశంపై చెరగని ముద్ర వేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed