Supreme Court: దీక్ష విరమింపజేయాలని మేము ఆదేశాలివ్వలేదు.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్

by vinod kumar |   ( Updated:2025-01-02 16:13:05.0  )
Supreme Court: దీక్ష విరమింపజేయాలని మేము ఆదేశాలివ్వలేదు.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Jagjith singh dallewal) కేసు విచారణలో భాగంగా పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. దల్లే వాల్ నిరాహార దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పంజాబ్ ప్రభుత్వ అధికారులు కొందరు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. నిరాహార దీక్షను విరమింపజేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేదని, ఆయన ఆరోగ్యం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నామని జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దల్లేవాల్ కేసుపై బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. వైద్య సాయం అందించాలన్న ఆదేశాలను దీక్ష విరమించే ఉద్దేశంతో ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవద్దని సూచించింది.

నిరాహార దీక్ష విరమించాలని కోర్టు దల్లేవాల్‌పై ఒత్తిడి తెస్తోందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ధర్మాసనం పేర్కొంది. అయన దీక్ష విరమించకూడదని స్పష్టంగా ఆదేశించామని తెలిపింది. ‘దల్లేవాల్ దీక్ష కొనసాగించొచ్చు. ఆస్పత్రికి తరలించడం అంటే దీక్ష విచ్ఛిన్నం చేయడం కాదు. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరు. కేవలం రైతుల పక్షాన మాత్రమే పోరాడుతున్నారు’ అని పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వాదనలు వినిపించారు. రాష్ట్రం పక్షపాత ధోరణిని అవలంభించడం లేదని తెలిపారు. ఈ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించి, ఆస్పత్రిలో చేర్చేందుకు పంజాబ్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువును అత్యున్నత న్యాయస్థానం జనవరి 6 వరకు పొడిగించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా సోమవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అధికారుల బాధ్యతారాహిత్య ప్రకటనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గతేడాది నవంబర్ 26న దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Read More ....

Madras High Court : అన్నా యూనివర్సిటీ రేప్ కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు


Advertisement

Next Story

Most Viewed