- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేడ్కర్ భవనాల జాడేది?
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలో ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో భూమిపూజ చేస్తే ఏడేళ్ల తర్వాత అది సాకారమైంది. సుమారు రూ. 146 కోట్ల ఖర్చుతో తయారు చేసిన కాంస్య విగ్రహాన్ని అంబేడ్కర్ జయంతి రోజున లాంఛనంగా కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. దళితుల పట్ల ప్రేమ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వారి సంక్షేమం కోసం తొమ్మిదేళ్ల కాలంలో చేసిన కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క గురువారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. మరోవైపు 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేతగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కట్టిన అంబేద్కర్ భవన్‌లు ఎన్ని అనే చర్చ మొదలైంది.
2014 మెనిఫెస్టోలో..
షెడ్యూల్డు కులాల సంక్షేమం కోసం పలు హామీలను ఇచ్చిన కేసీఆర్ ప్రతి మండల కేంద్రంలో అంబేడ్కర్ పేరుతో వికాస కేంద్రాల (భవన్)ను స్థాపించనున్నట్లు 2014 ఎన్నికల మెనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దళితుల సాధికారికత కోసం అవసరమైన సమాచారాన్ని అందించేలా కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం తదితరాలను ఈ కేంద్రాల్లో సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రకారం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంబేడ్కర్ భవనాలు, వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాల కోసం ఎంత చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేయాలో రాష్ట్ర ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ జీవోల ద్వారా అన్ని జిల్లాలకు స్పష్టత ఇచ్చింది. దానికి కొనసాగింపుగా 2017 జూలై 22న ఒక జీవో (నెం. 357), ఆ తర్వాత 2018 జూలై 19న మరో జీవో (నెం. 301)ను ఆ శాఖ విడుదల చేసింది.
కేటాయింపులు రూ. 470 కోట్లు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంబేడ్కర్ భవనాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లలో రూ. 470.56 కోట్లను కేటాయించింది. దానికి తగినట్లుగానే ఆయా సంవత్సరాల్లో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కూడా ఆర్థిక శాఖ నుంచి, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ నుంచి విడుదలయ్యాయి. చివరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో రూ. 91.89 కోట్లు మాత్రమే ఖర్చయింది. గరిష్టంగా 2018లో ఎన్నికల సమయం (2018-19)లో రూ. 180 కోట్లు, దానికి ముందు సంవత్సరం (2017-18)లో రూ. 130 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. కానీ ఖర్చు మాత్రం 2017-18లో రూ. 3.55 కోట్లు, 2018-19లోరూ. 6.20 కోట్ల చొప్పున మాత్రమే ఖర్చయింది. చాలా జిల్లాల్లో భవన్‌ల నిర్మాణం మొదలే కాలేదు. ఇంకొన్ని జిల్లాల్లో భూ సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. మరికొన్ని జిల్లాల్లో పనులు మొదలైనా ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు వికారాబాద్ జిల్లాను పరిశీలిస్తే అంబేడ్కర్ భవన్ (కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి నవాబుపేట మండలానికి రూ. 25 లక్షలు, తాండూర్ మండలానికి రూ. 50 లక్షలు, యాలాల్ మండలానికి రూ. 25 లక్షల చొప్పున మంజూరయ్యాయి. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటున్నందున ఈ నిధులను ఆ శాఖకే విడుదల చేసినట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ పేర్కొన్నది. కానీ మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరే కాకపోవడంతో విడుదల కూడా లేకుండాపోయింది. మంచిర్యాల జిల్లాను పరిశీలిస్తే రూ. 1.25 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 21.64 లక్షలు మాత్రమే విడుదలైంది. ఆ మేరకే భవన్‌ల నిర్మాణానికి ఖర్చు చేయగలిగింది.
హన్మకొండ జిల్లాలో ఐదు భవన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అంచనా వ్యయంపై నివేదికలు రూపొందినా, గత నెల చివరి వరకు కనీసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఫండ్స్ రిలీజ్ కాలేదు. భవన్‌లు నిర్మాణం కాలేదు. ఒక్కో భవన్ నిర్మాణానికి కనీసంగా 20 గుంటల భూమిని ఇవ్వాల్సిందిగా ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ ఆయా మండలాల తహశీల్దార్లను రాతపూర్వకంగా కోరింది. కానీ ఇప్పటివరకూ ఎలాంటి రిప్లయ్ రాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఒక్కొక్కటి 50 గుంటల విస్తీర్ణంలో భవన్‌లను నిర్మించడానికి భూ సేకరణ దాదాపుగా పూర్తయినా ఆరు చోట్ల మాత్రమే భవన్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వేర్వేరు దశల్లో ఆగిపోయింది. వీటన్నింటి పనులు 2019లో మొదలయ్యాయి. ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. ఈ జిల్లాలోని అన్ని భవన్‌ల నిర్మాణానికి మొత్తం రూ. 4 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే మార్చి చివరి నాటికి కేవలం రూ. 97.90 లక్షలు మాత్రమే ప్రభుత్వం నుంచి విడుదలైంది.
తొమ్మిదేళ్లలో అంబేడ్కర్ భవన్‌ల బడ్జెట్ (రూ. కోట్లలో)
సంవత్సరం కేటాయింపు విడుదల
2014-15 0.20 0
2015-16 10.26 4.71
2016-17 85 2.25
2017-18 130 3.55
2018-19 180 6.20
2019-20 0 14.64
2020-21 0 0.53
2021-22 40 3.48
2022-23 25 56.38