దినదిన గండంగా జీహెచ్ఎంసీ పరిస్థితి.. ఆదాయ పెరుగదలపై ఫోకస్ పెట్టిన సర్కార్

by karthikeya |   ( Updated:2024-11-16 16:20:20.0  )
దినదిన గండంగా జీహెచ్ఎంసీ పరిస్థితి.. ఆదాయ పెరుగదలపై ఫోకస్ పెట్టిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఖజానాలో నిధుల్లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. కొన్నిశాఖల్లో అయితే జీతాలు ఇవ్వడానికి కూడా పైసల్లేని దుస్థితి దాపురించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ తరుణంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు వనరులపై దృష్టి సారించారు. వనరుల్లో ముఖ్యమైనది ఆస్తిపన్ను ఆదాయమే. ఆస్తిపన్ను పెంచకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. వీటిలో అసలు ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించే నెట్ వర్క్ లోని ప్రాపర్టీలెన్ని? భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతేంటి? ప్రస్తుతం ఆ భవనంలో మార్పులేంటి? పదేండ్ల క్రితం ఇప్పటికి తేడా ఏంటి? రెసిడెన్సియల్ కోసం అనుమతి తీసుకుని కమర్షియల్ నిర్మాణం చేపట్టిన భవనాలెన్ని? కమర్షియల్ కేటగిరిలో కరెంట్ బిల్లు చెల్లిస్తూ..రెసిడెన్షియల్ కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న ప్రాపర్టీలెన్ని? అనే అంశాలపై సర్వే చేసి, నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వే చేయడానికి నియోజియో అనే సంస్థకు అప్పగించారు. దీనికి జీహెచ్ఎంసీ సదరు ఎజెన్సీకి రూ.22కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ కమిషనర్/డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్(సీడీఎంఏ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 144 మున్సిపాలిటీల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో ప్రభుత్వం అధికారులే సర్వే చేస్తున్నారు. పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖలోని జీహెచ్ఎంసీ, సీడీఎంఏ విభాగాలు ఒకే లక్ష్యంతో సర్వే చేస్తున్నాయి. కానీ జీహెచ్ఎంసీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయినా సర్వేను ప్రయివేటు ఎజెన్సీకి ఇవ్వడంపై సంస్థ అధికారులే తప్పుపడుతున్నారు. అనవసరమైన ఖర్చులేంటని మండిపడుతున్నారు. నామమాత్రపు ఖర్చుతో సీడీఎంఏ చేపట్టిన సర్వేను ప్రశంసిస్తున్నారు.

గ్రేటర్ లో జీఐఎస్ సర్వే

గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి జులై మాసంలో జీఐఎస్ సర్వేను ప్రారంభించారు. 18 నెలల్లో పూర్తిచేస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొదటగా డ్రోన్ల ద్వారా సర్వే చేసి తర్వాత ఫీల్డ్ సర్వే చేస్తారు. జీహెచ్ఎంసీ డేటా ఆధారంగా సర్వే పూర్తి చేసి ఆస్తి పన్నుల్లో మార్పలు చేయనున్నారు. ఈ సర్వేకు జీహెచ్ఎంసీకి టాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ) సహకారంలేకుంటే సర్వే ముందుకుపోని పరస్థితి నెలకొంది. కానీ అప్పనంగా రూ.22కోట్లు ఆ సంస్థకు కట్టబెట్టేందుకు సర్వే చేస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 19.40లక్షల మంది మాత్రమే జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇంకా పది లక్షలకుపైగా ఆస్తి పన్ను పరిధిలో లేరని అధికారుల అంచనా. దీంతోపాటు ఎప్పుడో ఇంటి అనుమతి తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి జీ+1, జీ+1 ఉంటే ఆపై అంతస్తుల్లో నిర్మాణాలు చేపట్టిన ఇండ్లు, రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని వాణిజ్య భవనంగా మార్చిన ఇండ్లను గుర్తించడానికే జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వే చేపట్టింది. వీటన్నింటి ద్వారా జీహెచ్ఎంసీ రూ.6,900కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను వసూళ్లలో 145 మంది టాక్స్ ఇన్ స్పెక్టర్లు, 340 మంది బిల్ కలెక్టర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు.వీరితో సర్వే చేయిస్తే మంచి ఫలితాలు వచ్చేదని పలువురు డిప్యూటీ కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నియోజియోకు జీహెచ్ఎంసీ నోటీసులు

గ్రేటర్ పరిధిలో జీఐఎస్ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని జీహెచ్ఎంసీ అసంత్రుప్తి వ్యక్తం చేసింది. దీంతో నియోజియో ఎజెన్సీకి జీహెచ్ఎంసీ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. సర్వే నత్తనడక సాగడంపై జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(ఐటీ, రెవెన్యూ) ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. చందానగర్ లో సర్వే సరిగ్గా చేయలేదని విమర్శలొస్తున్నాయి.

సీడీఎంఏ పరిధిలో

రాష్ట్ర వ్యాప్తంగా 144 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుఆదాయం పెంచడానికి ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో మున్సిపాలిటీల అధికారులే భువన్ సర్వే నిర్వహించారు. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24లక్షల ఆస్తిపన్ను చెల్లింపు దారులున్నారు. వీటిలో 2018 నుంచి 2021 వరకు 18లక్షల ప్రాపర్టీలను జియోట్యాగింగ్ చేశారు. తర్వాత అధికారులు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన కొలతలు తీసుకుని మొబైల్ యాప్ లో ఎంట్రీ చేస్తారు. ఈ వివరాలన్ని సర్వర్ తీసుకుంటుంది. అక్కడి నుంచి పాత, కొత్త వివరాలు నేరుగా మున్సిపల్ కమిషనర్ కు వెళ్తాయి. వీటిని పరిశీలించిన కమిషనర్ సంబంధిత యజమానికి డిమాండ్ నోటీసు జారీచేస్తారు. వీటిలో 5లక్షల ప్రాపర్టీలకు సంబంధించిన ఆస్తి పన్నును సవరించడం ద్వారా రూ.160కోట్లు పెరిగింది. మరో 5.5లక్షల ప్రాపర్టీల్లో ఏలాంటి మార్పులు లేవు. సర్వే చేసిన కూడా ఆస్తిపన్ను సరిగ్గానే చెల్లిస్తున్నారని అధికారులు గుర్తించారు.మరో 7.5లక్షల ప్రాపర్టీలను వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా సుమారు 7లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉంది. 2023-24లో రూ.922కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2024-25లో రూ.1300కోట్లు వసూలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నామమాత్రపు ఖర్చుతో ఆదాయాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టిన సీడీఎంఏ అధికారులను ఆయా ప్రభుత్వ శాఖలు అభినందిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed