‘కుడా’ విస్తర‌ణ‌ దిశగా ప్రభుత్వం అడుగులు.. అంత‌ర్భాగం కానున్న మరో 3 నియోజకవర్గాలు!

by Gantepaka Srikanth |
‘కుడా’ విస్తర‌ణ‌ దిశగా ప్రభుత్వం అడుగులు.. అంత‌ర్భాగం కానున్న మరో 3 నియోజకవర్గాలు!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వ‌రంగ‌ల్ కాక‌తీయ పట్టణాభివృద్ధి సంస్థ విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర్చ‌డంతో పాటు ప‌ట్ట‌ణాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సంస్థ ప‌రిధి పెంచేందుకు నిర్ణ‌యించింది. ప్రస్తుతం కుడా 1,805 చదరపు కిలోమీటర్ల ప‌రిధిని ఏకంగా 2800 చ.కిమీ. వ‌ర‌కు పెంచాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇటీవ‌ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగిన మీటింగ్‌లో కుడా చైర్మన్ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ స‌మీక్ష‌లో కుడా విస్త‌ర‌ణ‌తో పాటు మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లుకు సంబంధించి ప్ర‌ధానంగా చ‌ర్చించారు. కుడా ప‌రిధిని పెంచ‌డం ద్వారా వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, కాజీపేట ప‌ట్ట‌ణాల శివారుల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంద‌ని భావిస్తున్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని స‌ర్వోతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ముందుగా పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి.. నూత‌నంగా ప‌లు ప్రాజెక్టుల‌ను చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయితే వ‌చ్చేనెల 9న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాళోజీ క‌ళాక్షేత్రంను ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే కుడా మాస్ట‌ర్ ప్లాన్‌కు ఆమోదంతో పాటు కుడా ప‌రిధి పెంపున‌కు సంబంధించిన ఉత్త‌ర్వులును ప్ర‌భుత్వ రిలీజ్ చేయనున్న‌ట్లు స‌మాచారం.

2800చ‌.కిమీ.ల‌కు విస్త‌ర‌ణ‌..!

కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ 1981లో తొలిసారిగా ఏర్పాటైంది. ప్రస్తుతం కుడా 1,805 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్త‌రించి ఉంది. వరంగ‌ల్ ప‌ట్ట‌ణానికి స‌మీపంలో ఉన్న వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ జిల్లాల ప‌రిధిలోని మొత్తం 19 మండలాలకు చెందిన 181 గ్రామాలు అంత‌ర్భాగంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం కుడా వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ జిల్లాల్లో విస్త‌రించి ఉండ‌గా మొత్తంగా 19 మండ‌లాల్లో విస్త‌రించి ఉంది. హ‌న్మ‌కొండ జిల్లాలో భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హనుమకొండ, హసన్‌పర్తి, ఐనవోలు, కమలాపూర్, కాజీపేట, వేలేరు, ఆత్మకూర్, దామెర మండ‌లాలు, వ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌రంగ‌ల్, ఖిలా వరంగల్, వర్ధన్నపేట, గీసుగొండ, సంగెం మండ‌లాలు, జ‌న‌గామ జిల్లాలోని చిల్పూర్, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, జఫర్‌గఢ్ మండ‌లాల్లో విస్త‌రించి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం కుడా ప‌రిధిని 2800 చ‌ద‌రపు కిలోమీట‌ర్లు మేర‌ భారీగా పెంచేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తోంది.

కొత్తగా కుడాలో చేరే మండ‌లాలు..!

ప‌ర‌కాల‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, న‌ర్సంపేట‌, జ‌న‌గామ ప‌ట్ట‌ణాల‌తో పాటు క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిధిలో ఉన్న హుజురాబాద్ ప‌ట్ట‌ణాన్ని కూడా ప‌రిధిలోకి తీసుకురానున్నారు. కుడా విస్త‌ర‌ణలో భాగంగా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చెన్న‌రావుపేట‌, దుగ్గొండి, న‌ర్సంపేట అలాగే ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ర‌కాల, న‌డికూడ‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాయంపేట‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌ఫ‌ర్‌గ‌డ్‌, లింగాల‌ఘ‌ణ‌పురం, జ‌న‌గామ నుంచి జ‌న‌గామ‌, జ‌న‌గామ రూర‌ల్ వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ర్వ‌త‌గిరి మండ‌లాలు విలీనం కానున్నాయి.

Advertisement

Next Story