న్యూ యాక్ట్ వైపు సర్కారు అడుగులు.. కొత్త చట్టమే.. ఆల్టర్నేటా..?

by Rajesh |
న్యూ యాక్ట్ వైపు సర్కారు అడుగులు.. కొత్త చట్టమే.. ఆల్టర్నేటా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆర్వోఆర్-2020’కి ముందు రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగిందనిపిస్తే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఉండేది. తహశీల్దార్ న్యాయం చేయలేదనిపిస్తే ఆర్డీఓకు అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉండేది. అక్కడా పట్టించుకోనట్లనిపిస్తే జాయింట్ కలెక్టర్ కు మొర పెట్టుకునే అవకాశముండేది. పైసా ఖర్చు లేకుండా.. ఎక్కడైనా ఓ తెల్ల కాగితం మీద తమ ఆవేదనను రాసిచ్చే వీలుండేది. కానీ ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం 2020’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ చెప్పిందే న్యాయంగా, అందులోని డేటానే సర్వస్వంగా మారింది. ఏదైనా పొరపాటు జరిగిందనిపిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిందే..

ధరణి పోర్టల్ లో మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశమున్నా.. ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా, దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వకుండానే తిరస్కరిస్తున్నారు. గుంట భూమికి కూడా కోర్టులో కేసు వేసి, న్యాయవాదిని నియమించుకొని, వాదనలను హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొన్నది. పేద రైతులు కోర్టుకు వెళ్లి ఇవన్నీ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అప్ లోడ్ చేసిన డేటాతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే కొత్త చట్టం రూపకల్పనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు దీన్ని విభేదిస్తున్నట్లు తెలిసింది. అయితే అనేక లొసుగులతో ఉన్న ఆర్వోఆర్-2020 చట్టం అమలు చేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటీ, రెండు సవరణలతో కూడా మెరుగయ్యే పరిస్థితి లేదని, దీంతో మెరుగైన భూ పరిపాలన వ్యవస్థ ఏర్పడదన్న నిపుణులు చెబుతున్నారు. కొత్త చట్టం రూపొందించడమే పరిష్కారమని చెబుతున్నారు.

‘ఆటోమెటిక్’ డేంజర్

ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు, ఆటోమెటిక్ మ్యుటేషన్ సాఫీగా సాగుతుందనే ప్రచారం ఉంది. అయితే అందులో అవి ఒక భాగం మాత్రమే. ఇంకా అనేక అంశాలు, చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంటుంది. ధరణి డేటా ద్వారా భూమిని కొనుగోలు చేస్తే ఏ వివరాలను కూడా ఇవ్వడం లేదు. పేర్లు మార్చి కొత్త పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టం మాదిరిగా భూ సంబంధ అంశాల్లో లావాదేవీలు అమలు చేయడం ప్రమాదకరమని భూ చట్టాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి భూమి లేదా ల్యాండ్ పార్శిల్ కు ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి లావాదేవీలోనూ దాన్ని పొందుపర్చకుండానే నిర్వహిస్తే మున్ముందు తలెత్తే సమస్యలకు పరిష్కార మార్గాలు క్లోజ్ అవుతాయి. ప్రతి లావాదేవీకి ప్రీవియస్ హిస్టరీని జత చేయాల్సిన పాత విధానమే మంచిది. ఆటోమెటిక్ మ్యుటేషన్ తెలంగాణ రెవెన్యూ డేటాతో అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో 30 రోజుల్లో మ్యుటేషన్ అంటేనే అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే తెలంగాణలో మోఖా మీద ఎవరున్నారు? అసలు ల్యాండ్ ఉందా? లేదా? అంతకు ముందు లావాదేవీలు ఏమైనా జరిగాయా? కుటుంబంలో పంపకాల సమస్యలు ఉన్నాయా? ఇలాంటివన్నీ ఎంక్వయిరీ చేయకుండా మ్యుటేషన్ చేయడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆర్వోఆర్ 2020 లొసుగులు..

– రిజిస్ట్రేషన్ చట్ట సవరణ చేయకుండానే వ్యవసాయ భూముల క్రయ విక్రయాలపై అధికారాలను తహశీల్దార్లకు కట్టబెట్టారు. ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టాల అమలు ద్వారా లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– రికార్డులను సవరించే వ్యవస్థ లేకుండా అమలు చేయడమంటే న్యాయం పొందే హక్కును కాలరాయడమేనని న్యాయవాదులు వాణి, అభిలాష్ లు అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా రికార్డులను తయారు చేసే వారికి, వాటిని సరిదిద్దే అధికారం ఉంటుందని, ఆర్వోఆర్ 1971 చట్టంలోనూ రికార్డులను సరిదిద్దే అధికారం తహశీల్దార్లు, ఆర్డీఓలకు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు రికార్డులను తప్పుగా నమోదు చేసి రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది మానవ హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటున్నారు. భూమి ఉండి హక్కుల్లేకుండా చేయడం వల్ల రైట్ టూ ఈక్వాలిటీకి భంగం కలుగుతుందన్న అభిప్రాయం ఉంది.

– ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి వివిధ మాడ్యూళ్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. దరఖాస్తు చేసుకుంటే అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ చట్టం ప్రకారం కలెక్టర్లు సవరిస్తున్నారు? సరిదిద్దే అధికారం ఎవరికి, ఎలా అప్పగించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

– న్యాయం కోసం సివిల్ కోర్టుకు వెళ్లమని అధికారులు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. రికార్డులను చూసి సరి చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. భూ యాజమాన్య హక్కులపై మాత్రమే కోర్టులకు వెళ్తారు. ప్రతి దానికి కోర్టుకే వెళ్లాలంటూ రెవెన్యూ యంత్రాంగం సూచిస్తున్నది. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన పరిధిలోకే వస్తుంది.

– సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చాన్స్ లేకుండా చేశారు. కనీసం పెండింగు దరఖాస్తులకైనా పరిష్కారం లభించకుండా వివాదాలు సృష్టించారు.

రాజ్యాంగ హక్కులకు భంగమే

-ఎం.సునీల్ కుమార్, రెవెన్యూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు

‘ఆర్వోఆర్ 2020’తో రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగింది. ఇందులో రికార్డుల సవరణకు అవకాశం లేదు. గ్రీవెన్స్, అప్పీల్ మెకానిజం లేనే లేదు. సామాన్య రైతు ప్రతి చిన్న దానికి సివిల్ కోర్టుకే వెళ్లాలంటే చాలా కష్టం. మండల స్థాయిలోనే పరిష్కారం లభించడం న్యాయం. ఆటోమెటిక్ మ్యుటేషన్ ఇక్కడ సాధ్యం కాదు. భూ వివరాలు వంద శాతం సక్రమంగా ఉన్నప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఏపీలో 30 రోజుల్లో చేస్తుంటేనే ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ సెకన్లలోనే చేసేస్తామంటే సమస్యలను సృష్టించడమే అవుతుంది. రిజిస్ట్రేషన్, సక్సెషన్ వేర్వేరు ప్రక్రియలు. రెండూ ఆటోమెటిక్ ఎలా చేస్తారు? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు లేదు. ఇలాంటి అనేక లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ చట్ట సవరణతో పరిష్కారం కావు. ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా కొత్త చట్టాన్ని రూపొందించుకోవడమే బెటర్. అందుకే ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చింది. ఇతర రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసి.. మెరుగైన చట్టం రూపొందించాలి. రైతు కోణంలో ఆలోచించినప్పుడే మెరుగైన చట్టాన్ని రూపొందించవచ్చు.

Next Story

Most Viewed