కన్నీటి సంద్రమైన ఇందూర్… జన హృదయ నేతకు అశ్రునివాళి

by Kalyani |
కన్నీటి సంద్రమైన ఇందూర్… జన హృదయ నేతకు అశ్రునివాళి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తో జన హృదయ నేతగా పేరొందిన మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు ఇందూరు ప్రజలు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో డీ.శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతినగర్ లోని డీ.శ్రీనివాస్ నివాస గృహం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమ యాత్రలో పాల్గొని డీఎస్ కు అశ్రు నివాళులర్పించారు.

డీ.శ్రీనివాస్ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారి జనసంద్రంగా మారింది. డీ.శ్రీనివాస్ అమర్ హై...శీనన్న అమర్ హై నినాదాలు హోరెత్తాయి. వేలాదిమంది అంతిమ యాత్రలో పాల్గొని జన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వద్ద డీ.శ్రీనివాస్ మృతదేహానికి అధికార లాంఛనాలతో నివాళులర్పించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మపూరి శ్రీనివాస్ పెద్ధ కుమారుడు సంజయ్ తన తండ్రి చితికి నిప్పంటించి ఆంతిమ సంస్కారాలను నిర్వర్తించారు.

డీఎస్ కుటుంబ సభ్యులైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డీ.సంజయ్ తదితరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఉదయం హెలికాఫ్టర్ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ లో రోడ్డు మార్గం గుండా ప్రగతినగర్ లోని డీ.శ్రీనివాస్ నివాసానికి చేరుకుని పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు డీ.శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన డీ.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా కొనసాగారని గుర్తు చేశారు.

విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులోనూ డీ.శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని, ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వపరంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. డీఎస్ గౌరవం ఇనుమడించేలా, ఆయనను ప్రజలు, అభిమానులు ఎల్లవేళలా గుర్తుంచుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను సచివాలయానికి పిలిపించుకుని, వారితో చర్చించిన మీదట డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డీఎస్ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధంజలి ఘటించి వెళ్ళిన తరువాత డిఎస్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఐజీ సుధీర్ బాబు, పోలీస్ కమిషనర్ కల్పేశ్వర్ ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని డీఎస్ పార్థివదేహం పై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మి నారాయణ, ఎనుగు రవిందర్ రెడ్డి, ఈర వత్రి అనిల్, గణేష్ గుప్తా, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి లతో పాటు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ నాయకులు పాల్గోని శ్రద్ధాంజలి ఘటించారు.

Next Story

Most Viewed