మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన(యూ), కాంగ్రెస్‌లతో కలిసి పోటీ: శరద్ పవార్

by S Gopi |   ( Updated:2024-06-30 12:13:50.0  )
మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన(యూ), కాంగ్రెస్‌లతో కలిసి పోటీ: శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఈ ఏడాది ఆఖరున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రె), కాంగ్రెస్‌లతో కలిసి ఎన్సీపీ(ఎస్) పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయన్నారు. శివసేన(యూ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్, ఇతరులతో కూడిన మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)లు కలిసి ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లలో జరిగే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతీ ప్రభుత్వాన్ని దించాలని లక్ష్యంగా ఉంది. 'మా లక్ష్యం అదే. ఇంకా మూడు నెలల సమయం మాకు ఉంది. మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోరాడుతాయని ' శరద్ పవార్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాల కారణంగా కలిగిన ప్రయోజనాలను కొనసాగించేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గానూ ప్రతిపక్ష ఎంవీఏ 31 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. అందులో కాంగ్రెస్ అత్యధికంగా 13, శివసేన(యూ) తొమ్మిది, ఎన్సీపీ(శరద్ పవార్) 8 ఎంపీ స్థానాలను గెలిచాయి. మహాయుతి కూటమి కేవలం 17 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అనేక చీలికల తర్వాత మహారాష్ట్రలో జరగబోయే ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఏక్‌నాథ్ షిండె తిరుగుబాటు కారణంగా ఉద్దవ్ ఠాక్రె నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సంఖ్యా పరంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండె బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గతేడాది జూలైలోనూ అజిత్ పవార్ తన మామ శరద్ పవార్‌కు వ్యతిరేకంగా పాలక ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలోనూ చీలిక ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed