కాంగ్రెస్‌ శ్రేణులకు శుభవార్త.. ఒకే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి?

by GSrikanth |   ( Updated:2022-10-20 14:02:35.0  )
కాంగ్రెస్‌ శ్రేణులకు శుభవార్త.. ఒకే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ-కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గ పోరు మునుగోడులో స్పష్టంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఇంకా సర్దుకోలేదు. తన సోదరుడి రాజీనామా అనంతరం ఎంపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం అయ్యారు. టీపీసీసీపై గుర్రుగా ఉన్న వెంకట్ రెడ్డి తన ఆగ్రహం ఇంకా చల్లారలేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. వెంకట్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి ఓ మెట్టు కిందకు దిగి క్షమాపణలు కూడా కోరారు. అయినా వెంకట్ రెడ్డి మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. మునుగోడుకు వచ్చేదే లేదు అలాగని పార్టీని వీడేది లేదంటూ తన చర్యలతో హస్తం పార్టీ నేతలను ఆంతర్మదనంలోకి నెడుతున్నాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇటీవల ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నిమిత్తం గాంధీ భవన్‌కు వచ్చిన వెంకట్ రెడ్డి సహచరులతో కూడా అంటిముట్టనట్లుగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే చిటపటలాడుతున్న వెంకట్ రెడ్డి ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో ఎదురుపడే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఆసక్తి రేపుతోంది.

కీలక కార్యక్రమానికి రేవంత్, వెంకట్ రెడ్డిలకు ఆహ్వానం:

మునుగోడు ప్రచారానికి వెళ్తారా అని ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు వెంకట్ రెడ్డి సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారు. మునుగోడులో హోం గార్డులకు పని లేదని ఎస్పీ రేంజ్ వాళ్లే అక్కడ పార్టీని గెలిపిస్తారని రేవంత్‌పై సెటైర్లు వేసిన సంగతి కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమైన మునుగోడు ఉప ఎన్నికలో వెంకట్ రెడ్డి కావాలనే ఇలా పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెరపైకి వస్తోంది. వీహెచ్ లాంటి పెద్దలు సైతం మునుగోడు ప్రచారానికి రావాలని లేకుంటే కోమటిరెడ్డిని కోవర్టు రెడ్డిలు అని చేస్తున్న అపవాదు నిజం అయ్యే ప్రమాదం ఉందని చెప్పినా వెంకట్ రెడ్డి తన మనసు మార్చుకోలేదు. రేవంత్ రెడ్డిపై ఉన్న కోపం ఆయన్ను ఇలా పార్టీకి దూరం చేస్తోందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు త్వరలో జరగబోయే ఓ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే అక్టోబర్ 26న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూసీ, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, పీసీసీ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఇతర ఏఐసీసీ ఆఫీస్ బేరర్లకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ కార్యక్రామానికి టీపీపీసీ హోదాలో రేవంత్ రెడ్డి, ఎంపీ హోదాలో వెంకట్ రెడ్డి హాజరుకావాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి హాజరు సంగతి ఎలా ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి ఈ ప్రోగ్రామ్‌కు వెళ్తారా? వెళ్లినా వీరిద్దరూ ఎదురుపడుతారా? ఒకవేళ ఎదురుపడినా ఇద్దరూ ముచ్చటించుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది.

అధిష్టానంతో అలా.. స్టేట్ లీడర్లతో ఇలా:

వెంకట్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందని రాష్ట్ర నేతలకు సైతం ఆయన టచ్‌లో ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అధిష్టానంతో ఆయన టచ్‌లో ఉన్నారని గతంలో ప్రియాంక గాంధీతో భేటీ అయి తన ఆవేదన చెప్పుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. పార్టీ మారాలని భావించినా ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీతో ఆయన వెనక్కి తగ్గారనే టాక్ వినిపించింది. త్వరలో తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొంటానని ఇదివరకే వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్టానం పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్న వెంకట్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి హజరయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం విషయంలో చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed