గ్రూపు-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలు వాయిదా

by GSrikanth |
గ్రూపు-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-2 పరీక్షల తేదీని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి తేదీలను ప్రకటించకపోయినా నవంబరులో నిర్వహించేలా ప్రస్తుత టైం టేబుల్‌ను రీషెడ్యూలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూలు విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, కార్యదర్శితో చర్చించారు. అన్ని కోణాల నుంచి ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చల తర్వాత పరీక్షలను వాయిదా వేయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీంతో పరీక్షలను నవంబరు నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇంకా నిర్దిష్టమైన తేదీలను మాత్రం పేర్కొనలేదు. ఈ వివాదం హైకోర్టులో సైతం పెండింగ్‌లో ఉన్నందున సోమవారం కల్లా స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఆ గడువు కంటే ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఫలించిన విద్యార్థుల నిరసనలు :

టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించేలా రెండు నెలల క్రితమే షెడ్యూలు ఖరారు చేసింది. అయితే జూనియర్ లెక్చరర్ పోస్టులు, గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు, ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు, నిరుద్యోగులు, అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నందున ఒకేసారి పలు పరీక్షలకు తయారుకావడంలో ఇబ్బందులున్నాయని, గ్రూప్-2 పరీక్షలను కనీసం మూడు నెలల పాటు వాయిదా వేయాలని, ఆ ప్రకారం రీషెడ్యూలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. సానుకూల స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా వేలాది మంది విద్యార్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళన చేశారు. చివరకు పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తాత్కాలికంగా వెనకడుగు వేసినా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యార్థులకు మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. అభ్యర్థుల ఆందోళనలో అర్థమున్నదని, ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. దానికి కొనసాగింపుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర శనివారం దీక్ష చేపట్టనున్నట్లు ఒక రోజు ముందే ప్రకటించారు. దీంతో పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. ఆ రెండు పార్టీల అనుచరులు గన్ పార్కు దగ్గరకు చేరుకునే ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని నొక్కిచెప్పారు. అనేక రూపాల్లో నిరసనల తర్వాత అభ్యర్థులు కోరుకున్నట్లుగా నవంబరు నెలకు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

కేటీఆర్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే :

అభ్యర్థుల ఆందోళనను, విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకున్న మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి 10 గంటలకు ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు గ్రూప్-2 పరీక్షలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో మాట్లాడి వాయిదాపై చర్చించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇకపైన కూడా నోటిఫికేషన్లను రూపొందించేటప్పుడు, షెడ్యూలును తయారుచేసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్లాన్ చేసుకోవాలని సీఎస్‌కు కేటీఆర్ సూచించారు. ప్రతీ అభ్యర్థి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా, ఆటంకాలు లేకుండా, అసౌకర్యం కలగకుండా ఉండేలా షెడ్యూలు ఉండాలని సూచించారు. కేటీఆర్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

Advertisement

Next Story

Most Viewed