Gold : పసిడి కొనగలమా?

by Prasanna |   ( Updated:2023-04-06 07:49:41.0  )
Gold : పసిడి కొనగలమా?
X

హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొన్ని వారాలుగా దేశంలో పసిడి ధరలు ప్రతిరోజు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంది. గతవారం వరకు స్థిరంగా కనిపించిన బంగారం ధరలు రెండు మూడు రోజుల వ్యవధిలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకుంది. ఇప్పటికే ప్రపంచ మాంద్యం పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిణామాల మధ్య ఆర్థిక భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడికి మొగ్గు చూపుతారని నిపుణులు సైతం అంచనా వేశారు. ఈ క్రమంలోనే బుధవారం పసిడి ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 61 వేలను దాటేసింది. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో పసిడ్ డిమాండ్ ఊపందుకుంది. దాంతో సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నెలకొనడం, బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా మదుపర్లు తమ సొమ్మును కాపాడుకునేందుకు, భవిష్యత్తు రక్షణ కోసం బంగారం వైపునకు మళ్లిస్తున్నారు. గత కొన్ని నెలల వ్యవధిలో పరిస్థితులతో సంబంధం లేకుండా ఆర్థికంగా భరోసా కోసం పసిడి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆర్థికవ్యవస్థల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం, దేశంలో కూడా ఆర్‌బీఐ కఠిన పాలసీ నిర్ణయాలను తీసుకుంటూ ఉండటంతో బంగారం సురక్షితమని సామాన్యులు భావిస్తున్నారు. బుధవారం నాటికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ఒక్కరోజే రూ. 1,030 పెరిగి రూ. 61,360కి చేరుకోగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 950 పెరిగి రూ. 56,250కి పెరిగింది. వెండి సైతం కిలోకు రూ. 2,900 పెరిగి రూ. 80,700గా ఉంది.

ఎందుకు పెరిగాయంటే..

గత రెండు రోజుల వ్యవధిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోను పసుపు లోహం ఎగసింది. అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా ఉండటం, ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర 2,000 డాలర్లకు చేరింది. ఇది ఏడాది గరిష్ఠం కావడం గమనార్హం. ఇక, డాలర్ ఇండెక్స్ కూడా గత కొన్నిరోజులుగా మందగిస్తోంది. బుధవారం డాలర్ మారకం విలువ 2 నెలల కనిష్టానికి పడిపోవడం కూడా పసిడి ధరలు పెరిగేందుకు దోహదపడింది.

రూ. 70 వేలకు చేరుతుందా..

బంగారం ధరలు క్రమంగా రికార్డు స్థాయిలకు చేరుకుంటున్న క్రమంలో 2023 చివరి నాటికి పది గ్రాములు రూ. 70 వేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, దేశంలో బంగారానికి ఉన్న గిరాకీని పరిశీలిస్తే పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతం వరకు బంగారంలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు.

ప్రధాన నగరాల్లో ధరలిట్లా ఉన్నాయి..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 61,510, ముంబైలో రూ. 61,360, చెన్నైలో రూ. 62,070, బెంగళూరులో రూ. 61,410, కోల్‌కతాలో రూ. 61,360గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed